అది వర్షఋతువు. తొలకర్లు మొదలయ్యాయ్. ఒక పెళ్ళికి వెళ్ళాను. సుమూహూర్తం రాత్రి ఎనిమిది గంటలకి. సాయింత్రం ఆరు గంటలైంది. విడిది ఇంట్లో వున్నాను. వసారాలో కూర్చొని ప్రకృతి శోభని చూస్తూ, ఆనందిస్తున్నాను. ఆ శోభను చూసింది చూస్తున్నట్లుగా, పెళ్ళి కబుర్లతోపాటు మీతో చెప్పాలనుకున్నాను. నేను చెప్పే వర్ణలనుబట్టి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, విచ్చేసిన అతిథులు ఎవరో మీరే ఊహించుకొని, తెలుసుకోవచ్చు. మరి నా ఊహల మనోరథంపై మీ ఊహల్నికూడా ఎక్కించి నాతోపాటుగా ముందుకు పదండి!!
అది పెద్ద కుటింబీకుల వారింట్లో పెళ్ళి. మరి పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా వుంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భూదేవంత అలుగు; అంతటా రంగవల్లులతో అలిగారు; ఆకాశమంత పందిరి వేసారు. పందిరి వైపుకు తలపైకెత్తిచూస్తే, నీలిరంగు వస్త్రంతో అలంకరించారు. చిన్న,చిన్న దీపాలు అసంఖ్యాకంగా పందిరికి అలంకరించారు. అవి నక్షత్రాల్లా మినుకు,మినుకు మంటున్నాయి. ఎటుచూసినా పచ్చని ఆకుల తోరణాలు. పచ్చని ఎత్తైన చెట్లు. అవి ఊగుతుంటే, విచ్చేసిన అతిథులకు నౌకర్లు వింజామరలు వీస్తున్నట్లుగా అనిపిస్తున్నది. చల్లని పిల్లగాలులు వీస్తున్నాయి. ఆ గాలిలో తొలకరి వర్షపు జల్లుల వాసనలుకూడా కలిసివున్నట్లు అనిపిస్తున్నది. విచ్చేస్తున్న అంతులేని అతిథులకు పన్నీరు నీటిని చిలకరించాలంటే కష్టమనుకున్నారేమోమరి ఆ పెళ్ళిపెద్దలు, ఆ పిల్లగాలులలోనే రకరకాల పూల పరిమళాల ద్రవ్యాలను కలిపివేసినట్లున్నారు. అందుకే చక్కటి పూల సుగంధాల పరిమళాలు అందరినీ తాకుతున్నాయి. హాయిగా వుంది.
అధి సంధ్యాసమయం. ఆరున్నర గంటలైంది. ఎంతోమంది ఆహూతులు పెళ్ళికి తరలివస్తుంటే, ఒక స్పురధ్రూపి మాత్రం రోజంతా తిరిగి,తిరిగి, పెళ్ళి పనులుచేసి, అలసిపోయాడో ఏమో, ఎర్రబారిన ముఖంతో, విశ్రాంతి తీసుకోవాలన్నట్లుగా ప్రక్కకు నిష్క్రమించాడు. ఆయన అటు వెళ్ళాడోలేడో, కిచకిచమంటూ కొన్నివేల పక్షులు ఆ చుట్టుప్రక్కలున్న చెట్లపైకి వచ్చి చేరుకుంటున్నాయి. వాటి కిలకిలారావాలు చూస్తే, పెళ్ళి సందడి అంతా వాటిదే అన్నట్లుగావుంది. ఒక్కసారి అలా నలువైపులా చూస్తే, ఆకాశంలో, వర్షానికిముందు, అటూఇటూ పరుగాడే మబ్బుల్లా, పెళ్ళిపెద్దలు సందడిచేస్తూ తిరిగుతున్నారు. చీకటి పడింది. ఎటుచూసినా దేదీప్యమానంగా దీపాలు వెలగటం మొదలయ్యాయి. ఆ దీపాల వెలుతురులో, చీకటి ఎటుపోయిందో ఏమో, ముఖం చాటేసుకొని పోయింది.
అది పెళ్ళి ముహూర్తం సమీపిస్తున్న సమయం. పెళ్ళికొడుకువారి కుటుంబం పెద్ద బలగమే వున్న కుటుంబం. పెళ్ళికొడుకు వాళ్ళు తొమ్మిదిమంది అన్నదమ్ములు. పెళ్ళికొడుకు పందిట్లోకి రాజసంగా విచ్చేసాడు. అతనికి తోడుగా ఒక కుందేలును, ఒక ముసలమ్మను తెచ్చుకున్నాడు. పెళ్ళికొడుకు చాలా అందంగా, నిండుగా వున్నాడు. చూసిన వాళ్ళంతా చంద్రుడులాగా వున్నాడని చెప్పుకుంటున్నారు. అతని అన్నదమ్ములందరూ అతని చుట్టూ, నవగ్రహాల్లా, కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో, ఒకవైపు కలకలం రేగింది. చూస్తే, పెళ్ళి కూతుర్ని తీసుకొని వస్తున్నారు. పెళ్ళికూతురి పేరు తార. ఆమె కుటుంబంకూడా చాలా పెద్దదే. పెళ్ళికూతురి అక్కా,చెల్లెళ్ళు మొత్తం ఇరవైఏడు మంది. పెళ్ళికూతురుతోసహా అందరూ చక్కని చుక్కలే. మిలమిలా మెరుస్తూ, తళుకులీనుతున్నారు. పెళ్ళికూతుర్ని చూసి, విచ్చేసిన వారంతా వీరిద్దరూ తారాచంద్రుల్లాగా వున్నారని అనుకుంటున్నారు. పెళ్ళికూతురు పందిట్లోకి వచ్చేసిందన్న విషయం తెలుసుకొని, పెళ్ళికొడుకు, ఉత్సాహంతొ, క్రీగంట పెళ్ళికూతుర్ని చూసి, చిరుమందహాసం చేసాడు. ఆ మందహాసం పెళ్ళికూతురుతో సహా చుట్టూవున్న ఆమె అక్కచెల్లెళ్ళ గుండెల్లో గుబులు రేపింది. ఒక్క క్షణం వారందరి చూపులు అతని చూపులతో కలిసిపోయాయి. అంతే, అదే సుముహూర్తం!! మనసా, వాచా, తారల్లాంటి ఆ ఇరవైఏడు మంది చంద్రుడిలావున్న ఆ పెళ్ళికొడుకునే తమ భర్తగా స్వీకరించారు. అంతే, ఆకాశమంతా తారల వెలుగులతో వెలిగిపోయింది. పెళ్ళి సందడి హోరు హెచ్చింది. పిల్లగాలులే సన్నాయి శబ్దాలు చేసాయి; ఉరుములు డోలు శబ్దాలు చేసాయి; చెట్లపైవున్న వేలాది పక్షులు ఒక్క ఉదుటున ఆకాశంలోకి శబ్దాలు చేసుకుంటూ ఎగిరాయి. వాటి కిలకిలారావాలే పెళ్ళి మంత్రాల్లా, పురోహితుల ఆశీర్వాదాల్లా వినిపించాయి.
అది ఒక విచిత్రమైన దృశ్యం; సన్నివేశం కూడా. ఆకాశంలో, చంద్రుడి చుట్టూ గూడు కట్టివుంటే తప్పక వర్షం పడుతుంది అని చెబుతారు. ఆ దృశ్యం అమోఘంగా వుంటుంది చూడటానికి. ఇప్పుడు, ఇక్కడకూడా, చంద్రుడిలాంటి పెళ్ళికొడుకు చుట్టూ ఆ ఇరవైఏడు మంది నవకన్యా తారలు గుమిగూడారు. మరి విచ్చేసిన అతిథులందరూ వారికి అభినందనలు తెలిపారు. అక్షింతలు చల్లబోతున్నారు. ఇంతలో, నా కంటికి ముందు రెండు పెద్ద మబ్బుతెరలు కనిపించాయి. నేను అనుకున్నంతా అయింది. చినుకులు పడటం మొదలయింది. వివాహ సమయంలో వర్షం పడటం శుభసూచికం అంటారు. మరి, ఆ పెళ్ళిపెద్దలు చల్లుతున్న అక్షింతలే వానచినుకులు కాబోలు!! మరి నా దృశ్యకావ్య యాత్ర ఇక్కడితో సమాప్తమైతే, ఆ మబ్బులచాటున, చిటపట చినుకుల మాపులో, ఆ నవదంపతుల శృంగార, సంసార యాత్రలో మొదటి రాత్రి శుభారంభమయింది.
ఉపసంహారం:– అన్నం పరమాత్మ స్వరూపమంటారు. ఆ అన్నరసంనుంచి పుట్టినవారే జీవులు. అంటే, జీవులకు ఆధారం అన్నమయితే, అన్నానికి ఆధారం నీరు; నీటికి ఆధారం వర్షం. పంటమొక్కలకు హరితాన్ని అందించేది సూర్యుడు అయినా, మొక్కలకు జవ,సత్త్వాలిచ్చి, కాపుకు వచ్చేటట్లు చేసేది చంద్రకాంతే!! అందుకనే, మనం సూర్యమానాన్నికంటే, చంద్రమానాన్ని అనుసరిస్తూవుంటాం. జాతక లగ్నంలోకూడా, చంద్రుడు ఏ రాశిలోవుంటే, ఆ రాశినే జన్మరాశిగా పరిగణిస్తాం. జీవితమనే వ్యవసాయంలో, భార్యా,భర్తలు తారాచంద్రుల్లాగా అన్యోన్యంగావుంటే, వారిపై పెద్దల ఆశీర్వచనాలు వర్షపు జల్లుల్లాగా కురుస్తూనేవుంటాయి. సర్వే జనా సుఖినో భవంత్| స్వస్తి|

మీ ప్రకృతి వర్ణన బాగుంది.
శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
ఈ వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం. “ సంక్రాంతి శోభ” అని మరొక వ్యాసం ఇంతకుముందు ఒకటి వ్రాశాను. అది మీకు తప్పక నచ్చుతుంది. చదవగలరు.
మీ స్నేహశీలి,
మాధవరావు.