ఈ ప్రపంచంలో మనిషికివున్న ముందుచూపులాంటి గుణంవున్న చిన్ని చీమలు, తేనెటీగల్ని, మహాఅయితే ఇంకొన్ని చిన్న జీవుల్ని మినహాయిస్తే, పశు,పక్ష్యాదులలో, రేపటికోసం, తమకంటూ దాచుకొనే జీవులు లేవనే చెప్పాలి. ఈ విషయం చెప్పగానే, నా ఆధ్యాత్మిక ప్రత్యక్ష గురువులు శ్రీ కేసరి హనుమానుగారు చెప్పింది గుర్తుకువస్తుంది. ఆయన ఏం చెప్పేవారంటే:–
నువ్వు ఏమి సాధించాలన్నా “ మూడు వేళ్ళ ” తత్త్వాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేవారు. చూపుడువేలు, మధ్యవేలు, ఉంగరపువేలు; ఈ మూడింటిని చూపించి, అందులో చూపుడువేలుని భూతకాలానికి చిందినది; మధ్యవేలు వర్తమానం; ఉంగరపువేలు భవిష్యత్ కాలానికి చెందినవి అని చెబుతూ, చూపుడువేలును మడిచి, భూతకాలం, అంటే నిన్నటి రోజు గడిచిపోయింది; దానిని ఈ రోజు అయిన వర్తమానానికి తీసుకురాలేం కదా! అని చెబుతూ, ఉంగరపువేలును మడిచి, రేపు రాబోయే రోజును ఈనాటి వర్తమానంలోకి తీసుకురావటంకూడా అసంభవమేకదా? అని అడుగుతూ, ఇక మిగిలింది మధ్యవేలు, అది వర్తమానకాలం. మనం ఇప్పుడు వుండేది, ఎప్పుడూ వుండేదీ ఈ కాలంలోనే. భూతకాలంలో చేసిన పనుల్లో మంచి,చెడులను బేరీజువేసుకొని, వర్తమానంలో చేసే పనులను మరింత సమర్ధవంతంగా, సుస్థిరంగా చేయాలి; వర్తమానంలో నీ చేతుల్లో వున్నదాన్ని ఏదో తెలియని ఆశతో, ఇతరులు చెప్పిన సలహాలు విని, రేపు చేసేద్దామని, ఈనాటిది రేపటికి వాయిదావేస్తే, వున్నది పోయిందీ, వుంచుకున్నదీ పోయిందీ అన్నట్లు అవుతుంది అని హెచ్చరిస్తూ, రేపు చేయాలనుకున్నదికూడా వీలున్నంతవరకు ఈరోజే, అంటే వర్తమానంలో చెయ్యి అని చెప్పేవారు.
వర్తమానంలో, తాము నమ్మింది చేసి ఎందరో మహామహులయ్యారు. రేపటి రోజుమీద ఆశవున్నా, మనిషిలోని బద్దకం, ఈ రోజు చేయాల్సిన పనిని చేయనివ్వదు. ఇది, మనలో చాలామందికి అనుభవమే. శరీర ఆరోగ్యానికి వ్యాయామం మంచిది, రోజూ తప్పక చెయ్యండి అని చెబుతే, ప్రొద్దునే లేవటానికి అలారం పెట్టుకొని, అది మ్రోగగానే, దాని నోరునొక్కేసి, ఏది ఏమయినా సరే, రేపటినుంచి చేస్తాను అని సర్దిచెప్పుకొని, నిద్రపోతాం. అంటే వర్తమానంలోని ఆ కొన్ని గంటలు భూతకాలంలోకి దొర్లిపోయాయిగదా!!
చిన్నప్పుడు, వారాల పేర్లు నేర్పటానికి, ఒక పాట నేర్పేవారు ఉపాధ్యాయులు. ‘ఆదివారంనాడు అరటి మొలచింది; సోమవారంనాడు సుడివేసి పెరిగింది.. … ..’ అంటూ చెప్పేవారు. అసలు మొదటి రోజున మొలవటం అంటూ జరగకపోతే, ఆ తరువాత పిలక వేయటం, పెరగటం, కాయలు కాయటం మొదలైనవన్నీ జరిగేవి కాదుకదా! వర్తమానంకంటే, భవిష్యత్‍లో వచ్చే రేపటి రోజుపైన మనిషికి ఎంత ప్రీతో ఈ క్రింది కొన్ని వాక్యాలు చెబుతాయి. ఆఖరికి చిన్నపిల్లవాడికికూడా ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు లేదేమో!! అని అనిపిస్తుంది. మనిషి మనస్తత్వమే అటువంటిది మరి. మరి ఈ క్రింది వాక్యాలు చదవండి:-
* మరో ఆలోచన వచ్చిందంటే, చేస్తున్న పనినికూడా వదిలేసి, ఆశల ఆకాశంలోకి ఎగరాలని చూస్తాం;
* మరో మెట్టు ఎక్కేదుంటే, నిలుచున్న మెట్టును వెనక్కి తన్నేస్తాం (ముందూ, వెనకా చూసుకోకుండా);
* మరో ఆటబొమ్మ ఇస్తానంటే, చిన్నపిల్లవాడుకూడా, చేతిలో వున్నదానిని వదులుకుంటాడు;
* మరో రోజు వుందంటే, ఈరోజును వదులుకొని, రేపటి రోజుకోసం ఆశతో ఎదురుచూస్తాం;
* మరో జన్మ వుందంటే, ఈ జన్మను వదులుకొని, వచ్చే జన్మకోసం, తపనతో, మరణించటానికి సిద్ధమవుతాం;
* భూమి తన చుట్టూ తాను తిరిగి వస్తుందేమోకానీ, జరిగిపోయిన రోజు మరలరాదు;
* కోయల కూసిందని, మధుమాసం ముందే వస్తుందేమోకానీ; రేపటి రోజు ఈరోజు కాలేదు;
* వర్తమానంలో జీవించలేని మనిషి, వర్తమానాన్ని ఆస్వాదించలేని మనిషి రేపటి రోజుని చూడలేడు.
