ఛత్రం సమర్పయామి అంటూ దేవుడికి షోడసోపచార పూజ చేసేటప్పుడు చెబుతారు. అంటే గొడుక్కి ఎంత ప్రాధ్యాన్యం వుందో మనకు తెలుస్తుంది.
మనకు తెలిసినంతవరకు ఎక్కువగా చూసేది నల్ల గొడుగు, తెల్ల గొడుగులనే. ఆధునిక కాలంలో రంగు గొడుగులు, రంగు,రంగుల కలబోత గొడుగులుకూడా వచ్చాయి. ఎండాకాలం, వర్షాకాలం వచ్చిందంటే, వీధి వెంబడి, “గొడుగులు బాగుచేస్తాం” అంటూ వాటిని బాగుచేసేవారు వచ్చేవాళ్ళు. ఎండనుంచి, వర్షంనుంచి కాపాడుకోవటానికోసం మనిషి ఎప్పటినుంచో ఈ గొడుగు వాడటాన్ని మొదలుపెట్టాడు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో ఈ గొడుగు వాడకం మనకు బాగా కనిపిస్తుంది. అడవులు, ఎడారులు, నదీతీరాలవెంబడి నివసించే వాళ్ళుకూడా తాటి ఆకులతో, ఈత ఆకులతో గొడుగులను తయారుచేసుకొని వాడటం మనం గమనిస్తూనే వుంటాం. నాటికి, నేటికీ గ్రామాల్లో మొగవాళ్ళు పనిమీద బయటకు బయలుదేరితే, తెల్లని దుస్తులు, నల్లటి గొడుగు లేకుండా బయటకే రారు.
ఇక రాజుల సంగతికివస్తే, పెద్ద గొడుగును ఆయనకు నీడగా పడుతూ వెంట ఒకళ్ళిద్దరు భటులు నడుస్తుంటారు. రాజుగారు ఏనుగుపైగానీ, రధంపైగానీ వెళ్తున్నప్పుడుకూడా గొడుగునివాడటం, అందునా అది ఒక్కొక్కసారి రాజదర్పానికికూడా గుర్తుగా వాడటం మనకు తెలిసిందే. యుద్ధాలలోకూడా రాజుల రధాలపై గొడుగు కనిపిస్తుంది మనకు. బలి చక్రవర్తిని భూమిలోకి అణగగొట్టటానికి వచ్చిన వామనుడుకూడా ఛత్రాన్ని పట్టేవచ్చాడు. మరిక దేవుళ్ళు సంగతీ! వారి దగ్గరికి వచ్చేసరికి ఛత్రాన్ని వాడటం భక్తి, మర్యాద, గౌరవ సూచకాలు. ఛత్రం అనగానే మనకు గుర్తుకువచ్చేది వినాయకుడు. ఛత్రం లేకుండా ఆయనకు పూజే చేయరుమరి!! మిగిలిన ఏ దేవుళ్ళను చూసినా (చిత్రాల్లో) గొడుగు కనిపిస్తుంది. దేవుడి ఊరేగింపు బయలుదేరిందంటే, రాజలాంచన చిహ్నంగా ముందు ఒకరు గొడుగు పట్టుకొని వస్తుంటే, వెనుక, రధంపై ఊరేగే స్వామికి ఆఛ్చాదనగా గొడుగుని తప్పకుండా పట్టటం మనం చూస్తూవుంటాం. అంతేకాదండీ బాబూ, నేటి ఆధునిక కాలంకూడా దేశాద్యక్షులు, ప్రధానులకు స్వాగతం చెప్పేటప్పుడు ఇప్పటికీ గొడుగును వాడుతున్నారుకూడా!!
ఇక నాటి, నేటి సినిమాల విషయానికివద్దాం. హీరో, హీరోయిన్స్ ప్రేమలో పడతారు. సరదాగా పాడుకుంటూ పొలాలగట్లంబడి, తోటల వెంబడి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు. అప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది. అప్పటివరకు మనకు గొడుగు కనిపించకపోయినా, ఉన్నట్లుండి హీరోయిన్ చేతిలో ఒక చిన్న గొడుగు కనిపిచ్చేస్తుంది. వాళ్ళిద్దరి వళ్ళంతా తడుస్తున్నా, ఇద్దరి తలలుమాత్రం గొడుగు క్రిందకు దూరి, కళ్ళు,కళ్ళూ కలుస్తాయి. గొడుక్కి మన సినిమాల్లో ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే ఒక చిన్న ఉదాహరణని చెబుతా: ఒక సినిమా. చాలా బాగుంది. ఒకతనికి ఆ సినిమా పిచ్చి,పిచ్చిగా నచ్చేసింది. ప్రతిరోజు, మూడు ఆటలకు తప్పనిసరిగా వచ్చి చూస్తున్నాడు. చూసి వెళ్ళేటప్పుడు గొణుక్కుంటూ వెళ్ళేవాడు. రోజూ ఇదే తంతు. తలుపు దగ్గర టికెట్లు తీసుకునే వ్యక్తి ఇతన్ని గమనించి, అసలు విషయాన్ని ఆరాతీసాడు. సంగతి తెలుసుకొని, అతను ముక్కున వేలేసుకున్నాడు. ఇంతకీ అతనికి ఏం తెలిసింది? సినిమాలో ముగింపు సన్నివేశంలో, ప్రేమికులైన హీరో, హీరోయిన్లు, ఒక నది ఒడ్డున కూర్చొని, నీళ్ళని చూస్తూ, ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ వుంటారు. వాళ్ళ వీపుభాగం మనకు కనిపిస్తుంటుంది. ఇంతలో వర్షం పడుతుంది. హీరోయిన్ గొడుగుని అడ్డంపెట్తుంది. హీరో, హీరోయిన్ ముఖాన్ని దగ్గరుకు తీసుకొని, ఆమె పెదవులపై ముద్దు పెట్టుకోబోతాడు. అయితే, హీరోయున్ గొడుగుని తలలు కనపడకుండా క్రిందకు దించుతుంది. ఆ ముద్దు దృశ్యం మనకు కనపడదు, సినిమా అయిపోతుంది. ఈ అభిమానికి ఆ దృశ్యం చూడాలని!! ఒక ఆటలో గొడుగు అడ్డంవచ్చినా, మరొక ఆటలో గొడుగు ప్రక్కకు జరిగి, ఆ దృశ్యం కనిపించకపోతుందా అని అతని ఆశ! అదండీ సినిమాల్లో గొడుగు గొప్పతనం!
సరే, ఇక నల్లరంగు గొడుగు, తెల్లరంగు గొడుగుల విషయానికి వచ్చేద్దాం.
నల్లటి గొడుగు: ఎంతదూరంలో వున్నా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది, చీకట్లో తప్ప. అసలు సప్తవర్ణాల్లో నీలంతప్ప, నలుపు అనే రంగే లేనేలేదు. ఇది మూడురంగుల కలయిక మాత్రమే. అసలు నలుపురంగు గానీ, మరే ఇతర రంగులైనా మన కంటికి ఎట్లా కనిపిస్తాయి. కాంతి కిరణం సప్తవర్ణ మిశ్రమం. ఒక గొడుగుకి నల్లరంగు వేసినప్పుడు, కాంతి కిరణం దానిపై పడితే, నలుపురంగుని తప్ప, మిగిలిన రంగులను అది తనలో కప్పివేసుకుంటుంది. అప్పుడు నల్లరంగు కాంతి మాత్రమే వెనక్కి తిరిగి, మన కంటిలో పడినప్పుడు, ఆ గొడుగుని నల్లరంగు గొడుగుగా మనం గుర్తిస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి.
సామాన్యంగా, నలుపురంగుని ఎక్కువమంది ఇష్టపడరు. ఒక అశుభ సూచికంగా భావిస్తారు. ‘శని, యముడు’కి నలుపు ఇష్టం. వారంటే మనకు అయిష్టం! అందుకే నలుపుని దూరంగా వుంచుతారు. చీకటికి, అజ్ఞానానికి నలుపు సంకేతం. అందువల్లకూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడరు. ఇక మరి, న్యాయమూర్తులు, న్యాయవాదులు నలుపు దుస్తులే వాడతారు. న్యాయంకోసం వారి దగ్గరికి వెళ్తాంకానీ, ఆ నల్లరంగుని మాత్రం మనం ఇష్టపడం. ఎందుకంటే, ఏమికనిపించకుండా చేయగలిగే నల్లని రంగులో, నిజాన్ని నేరేడు కాయగా చేసి, కప్పిపుచ్చి, అబద్దాన్ని గెలిపిస్తారేమోనన్న ఒక భయంతో!! మరి, ఇంకొక ప్రక్క చూస్తే, అయ్యప్పస్వామి భక్తులు నల్లని వస్త్రాలనే భక్తితో ధరిస్తారు. ఈ రెండు విషయాలు పరస్పరం విరుద్ధంగా వున్నట్లు అనిపిస్తాయి.
అయితే, ఈ నలుపు రంగులో ఒక విశిష్టమైన తత్త్వం ఇమిడి వున్నది. న్యాయమూర్తులు, న్యాయాన్ని చెప్పేటప్పుడు, తనవారని, పరాయివాళ్ళనీ చూడకుండా, వారిపట్ల తనకు ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, వారియొక్క ఉద్రేకాలతో మమైక్యం చెందకుండా, ఒక అతీతుడుగా న్యాయాన్ని చెప్పాలి. అందుకు గుర్తుగానే ఈ నలుపురంగు దుస్తులను వాడుతారు. అయ్యప్ప భక్తులుకూడా ఈ గుణాలకు అతీతంగా మండలం రోజులు శ్రద్ధా,భక్తులు కలిగివుండాలని, గుర్తుగా ఈ రంగు దుస్తులనే వాడతారు. పైనచెప్పినట్లుగా ‘ శని, యముడు ’ని తీసుకుంటే, వీరు చేసేపనులు ధర్మానికి కట్టుబడి వుంటాయి. వీరిద్దరూ ధర్మం తప్పినవారిపట్ల ఎటువంటి జాలి, దయ చూపించరు; ఎవరిపట్ల రాగద్వేషాలుండవు. మరి వీరు ధరించే దుస్తులుకూడా నలుపువే!! అయితే, తాము తప్పుచేసినా, దయా,దాక్షిణ్యాలు చూపించికపోతే, వారిపట్ల ఎవరికైనా ( మనమే! ) ఇష్టం వుండదుకదండీ! అందుకే నలుపురంగు బట్టలను వేసుకున్నవాళ్ళని చూసినా, నలుపురంగు వస్తువులను చూసినా, మన మనస్సు తప్పక ఒకింత దూరం జరిగిపోయి, అయిష్టతను ఏర్పరచుకుంటుంది; అయిష్టతను ప్రదర్శిస్తూ వుంటుంది. కానీ, మనం అసలు తత్త్వాన్ని తెలుసుకోవాలికదా!
ఇక తెల్లరంగు గొడుగు: అన్ని రంగుల మధ్య కలిసిపోతుంది; నల్లరంగులాగా కాకుండా, చేకటిలో కనిపిస్తుందికూడా! మరి సప్త వర్ణాల్లో నలుపుకి కొంచెం దగ్గరగా చెప్పబడే నీలం రంగు అన్నావున్నది. కానీ, తెలుపురంగు విషయానికివస్తే, ఈ రంగనేదేలేదు. అయినా, అందరికి తెలిసిన విషయమే అది. సప్తవర్ణ మిశ్రమమే తెలుపు!! అంటే, అన్ని రంగులని తనలో ఇముడ్చుకొని, తేట తెల్లని ఒకే రంగుని ఆవిష్కరిస్తుంది. హారంలో పూలెన్ని రకాలున్నా, పూలహారం అని అంటాం; మానవుల్లో ఎన్ని రంగులున్నా, అందరినీ మానవులనే అంటాం; భగవత్ స్వరూపాలెన్నివున్నా భగవంతుడు ఒకడే అని అంటాం. తెలుపురంగుకూడా అలాంటిదే!
తెలుపురంగుకికూడా ఒక విశిష్టమైన తత్త్వమేవున్నది. ఇది స్వఛ్చతకి, పారదర్శకతకు, స్నేహానికి, శాంతికి చిహ్నం. యుద్ధాల్లో, శాంతి, స్నేహ చిహ్నంగా తెలుపురంగు జండాను చూపిస్తారు. పూజలు చేసేటప్పుడు ధవళవస్త్రాల్ని వాడతాం. రాజుల రధాలపైన అయినా, దేవతల ఊరేగింపు ఉత్సవాల్లోనైనా, తెల్లని ఛత్రాన్ని వాడటం చూస్తాం. చనిపోయినవారి తరుపు కుటుంబ సభ్యులకు, ‘చలువ బట్టల’ని తెల్లని వస్త్రాలను ఇవ్వటం మన ఆచారం. చనిపోయిన సమయంలో, ఆత్మశాంతికి చిహ్నంగా ధవళవస్త్రాలను వాడటంకూడా మన ఆచారమే. తెలుపురంగుకు మరొక గొప్పతనంకూడా వున్నది. ఇంద్రుని ఐరావతం; తెల్లని అశ్వాలు; తెల్ల ఛామరం; తెల్లని పుష్పాలు; తెల్ల పావురాలు; తెల్ల తామరలు; తెల్ల హంసలు ఉఛ్చస్థితికి, ఉన్నతిస్థితికి, ఉత్తమ గుణాలకి ప్రతీకగా చెప్పబడతాయి.
ఉపసంహారం:- ఇంతకీ ఈ గొడుగుల గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పాలి? మన మానవ జాతి,జాతంతా ఒకే గొడుగు క్రిందకు రావాలి; మన దేశ ప్రజలందరూ జాతి పిత పట్టిన గొడుగుక్రిందకు రావాలి; కష్ట,నష్టాలొచ్చినా, సుఖాలొచ్చినా కుటుంబ సభ్యులందరుగానీ, దేశ ప్రజలందరుగానీ ఒకే ధర్మమనే గొడుగు నీడలోనే బ్రతకాలి అని మనం ప్రతినిత్యం అంటుంటాం. కష్టాల్లో నిలిచిన ఆబాలగోపాలాన్నీ, గోవుల్ని, గోపాలుడైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా పైకెత్తిపెట్టి, ఒక్కటిగా సమిష్టిపరిచి, సమక్యతను చాటాడు. ఏ ఎండకాగొడుగు పట్టాలన్న సామెతలో అంతరార్ధం ఏదిఏమయినప్పటికీ, వైషమ్యాలు మరిచి, ఐకమత్యంతో, స్నేహభావంతో, ప్రేమభావంతో, పారదర్శకతకు, ప్రశాంతతకు చిహ్నమైన తెల్లనిరంగుగల గొడుగు క్రిందకే అందరూ రావాలని ఆశిద్దాం. నల్లగొడుగు, తెల్లగొడుగని మళ్ళీ రెండురకాలు; రెండురకాల ఆలోచనలు మనకెందుకు. ఒకటై, ఒకటిగా వుండాలనుకున్నాం కాబట్టి, అందరికి నచ్చేది, మెచ్చేది అయిన తెల్లగొడుగు క్రిందకే వద్దాం. ఏమంటారుమరి. సెలవ్. స్వస్తి.

అయ్యప్ప భక్తులు నల్లని దుస్తులనే ఎంధుకు ధరించవలెను?
మానవునికి రంగు రంగుల దుస్తుల మీద మక్కువ ఎక్కువ కాని ఆ అయ్యప్ప ధీక్ష లొ ఉన్న భక్తులకి దుస్తుల రంగుల పై మమకారం ఉండకూడదని చేప్పే అంధవిహీనమైన నల్లని దుస్తులు ధరిస్తారు. ఈ నల్లని దుస్తులు మనకి ఏన్నో విషయాల ను చెబుతాయి.
భక్తులు మాలను శీతాకాలంలొ ధరిస్తారు కావూన నల్లని దుస్తులు ధరించటం వలన సూర్యరశ్మీని గ్రహించి శరీరానికి చలి నుండి కపాడుతుంది.
అంతేకాక నలుపు శని దేవునికి ఇష్టమైన రంగు ఈ రంగు ధరించటం వలన శని దేవుడు శాంతిస్తాడు అని, శని భాధలు తొలుగుతాయని అంటారు.
అంతేకాక శబరిమల యాత్రలొ అడవుల గుండా రాత్రి వేళ లొ ప్రయాణం చేసేటప్పుడు జంతువుల భారిన పడకుండ నల్లని దుస్తులు (చీకటిలొ కలిసిపోవడం) కాపాడతాయి
శ్రీ రత్నం గారికి, నమస్కారములు.
మీ వ్యాఖ్యలు చక్కగా వున్నాయి.
మీ స్నేహశీలి,
మాధవరావు.
చాలా విషయాలు చాలా బాగా చెప్పేరు. సంతసం.
శ్రీ శర్మగారికి (kastephale), నమస్కారములు.
మీకు ఈ వ్యాసం నచ్చినందుకు నాక్కూడా సంతసం. ( ఈ పదం సంతసం వాడటం నాక్కూడా చాలా ఇష్టం).
మీ స్నేహశీలి,
మాధవరావు.
very good narration & mode of presention of a most common daily life with umbrella event. Now i understand & remember the talent of a writer similar to this in case of Amaravathi kathalu.
శ్రీ రాయుడు గారికి, నమస్కారములు.
నా వ్యాసం మీకు నచ్చినందుకు చాలా సంతోషం. `అమరావతి కధలు’ రచియుతతో నన్ను పోల్చటం చాలా గొప్ప విషయం,కానీ, ఆయనతో పోల్చుకోవటం హిమాలయాలుతో పోల్చటంవంటిది. నేను అందుకు తగనేమో. అయినా మీ అభిమానానికి కృతజ్ణాతలు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మనకు తెలిసినా తెలియకపోయినా, నమ్మినా నమ్మక పోయినా దైవత్వ మనే గొడుగు కింద ఉన్నాము. అది తెలుసుకున్నప్పుడు మీరు చెప్పిన :
“వైషమ్యాలు మరిచి, ఐకమత్యంతో, స్నేహభావంతో, ప్రేమభావంతో, పారదర్శకతకు, ప్రశాంతతకు చిహ్నమైన తెల్లనిరంగుగల గొడుగు క్రిందకే అందరూ రావాలని ఆశిద్దాం.”
తప్పకుండా జరుగుతుందని నా నమ్మకం.
శ్రీ లక్కరాజు గారికి,నమస్కారములు.
“దైవత్వమనే గొడుగు” ఓ! బహుబాగుగా, అర్ధవంతంగా చెప్పారు. మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
మీ స్నేహశీలి,
మాధవరావు.
ఛత్రము గురించి చక్కని వ్యాసం! నేనోచ్చేసా ఈ గొడుగు కిందకి!
శ్రీ రసజ్న గారికి, నమస్కారములు.
వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం. గొడుగు క్రిందకు మేరే మొట్టమొదటగా వచ్చేసారు. ఆనందం.
మీ స్నేహశీలి,
మాధవరావు.