ఒక పేద్ద ఆటస్థలం. జట్లు,జట్లుగా, పది-పదిహేనేళ్ళ వయసు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. వారి ఆటని చూస్తూ, తాము ఆనందిస్తూ, ఆడేవారిని చప్పట్లతో ఉత్సాహపరుస్తున్నారు చుట్టూవున్న పిల్లలు; పెద్దలు. అక్కడ అంతా కోలాహలంగా వుంది. ఒక గుంపులో ఒక పన్నేండేళ్ళ కుర్రాడుకూడా ఆటని చూస్తూ, కేరింతలు కొడుతున్నాడు. అతనికి ఆ ఆటంటే చాలా ఇష్టం. కానీ, అతను ఆడలేడు. కారణం అతనికి పోలియో వుంది. అతను పెద్దవాడయాడు, చదువయిపోయింది, ఉద్యోగంకూడా అయిపోయింది. ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగి. కానీ, అతనిలో క్రికెట్ ఆడాలన్న కోరికకు విశ్రాంతి దొరకలేదు.
అదొక సాంప్రదాయ కుటుంబం. ఇంటిపెద్ద సంగీత విద్వాంసుడు; ఇంట్లో అందరిపట్ల క్రమశిక్షణ ఎక్కువ. ఆయనకు ఒక కొడుకు; ఒక కూతురు. కూతురికి పెళ్ళి అయిపోయింది. కొడుకుకూడా చాలాబాగా పాడతాడు. తండ్రిలాగానే విద్వాంసుడయ్యాడు. అయితే, అతనికి సినిమాలంటే చాలా ఇష్టం. అందులోనూ, హీరో చిచ్చెరుపిడుగులాగా వుండి, ఆమ్మాయుల్ని ఏడిపిచ్చే విలన్లును; అమాయిక జనాల్ని మోసంచేసే మోసగాళ్ళను డుష్కుం-డుష్‍కూంంంమ్ అంటూ తన్ని, వాళ్ళు పారిపోతుంటే, చెట్లెక్కి, గోడలెక్కి వాళ్ళని తరిమిపట్టుకొని, దొరికి తీసుకువచ్చే హీరో సినిమాలంటే మహాఇష్టం. కానీ ఏంలాభం! వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా సినిమాకి తీసుకువెళితే, త్యాగయ్య, భక్తరామదాసులాంటి సినిమాలకే తీసుకు వెళ్ళేవారు. ఇతనూ పెద్దవాడయాడు; గొప్ప,గొప్ప కచేరీలతో తీరికలేకుండా, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టుకుంటూ ఇక విశ్రాంతి తీసుకునే వయకు వచ్చేసాడు. కానీ, తనకు ఇష్టమైన సినిమాలని, చూడాల్సిన వయసులో చూసి, ఆనందించలేకపోయాడు.
ఆయనొక గ్రామాధికారి. వయసు చిన్నదే. అయితే, తండ్రి చనిపోవటంతో తనకు గ్రామాధికారపత్యం వచ్చింది. తనకు ప్యాంట్, పొడుగుచేతుల చొక్కా వేసుకోవాలనివున్నా, అక్కడున్న మర్యాదలకు తలొగ్గి పంచె, లాల్చి, ఉత్తరీయాన్ని ధరించేవాడు. గ్రామానికి, పట్నంనుంచి కరగ్రాహకుడు ( కలెక్టర్ ) వచ్చినప్పుడు, ఆయన్ను చూసి, తనుకూడా సూటు, బూటు వేసుకోవాలన్న కోరిక పెరిగిపోయేది. అలా మనసులో కోరిక పెరుగుతుంటే, తన వయసుకూడా పెరిగిపోయింది; పిల్లలతో కలిసి, పట్నానికి వచ్చేసాడు; విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ, అతని కోరికమాత్రం నెరవేరలేదు.
కొడుకులిద్దరికీ క్రికెట్ అంటే ఇష్టంలేదు. వాళ్ళు టీ.వి. లోకూడా తమకి ఇష్టమైన టెన్నిస్, ఫుట్‍బాల్ ఆటల్నే చూసేవాళ్ళు. కానీ, మనవళ్ళుకు క్రికెట్ ఇంటే ఇష్టం. తనకు వయసు పెరిగి, పోలియోవలన ఎక్కువగా కదలలేక పోవటం వలన, తనకోసం కొడుకులు రెండో హాల్లో ఒక టీ.విని పెట్టించారు. తను అక్కడే క్రికెట్ చూస్తూ, పిల్లలందిరినీ చేర్చి, వాళ్ళకు ఆటగురించి చెప్పేవాడు. మనుమళ్ళు, వాళ్ళ స్నేహితులు పది-పన్నేండేళ్ళవాళ్ళే. వాళ్ళను చూస్తుంటే తన బాల్యం గుర్తుకువచ్చేది. పిల్లలూ నాకూ ఆడాలని వుందిరా అంటే, పిల్లలు కుర్చీలో కూర్చున్న తాతయ్యకు బంతినిచ్చి, బౌలింగ్ చెయ్యమన్నారు. కూర్చొనే బాల్ వేస్తే, బ్యాట్‍తో పిల్లలు గదిలోనే అటుఇటూ చిన్నగా ఆడారు. కొంచెం ఉత్సాహం ఎక్కువయిందేమో, బాల్‍ని గట్టిగా కొట్టేటప్పటికి బాల్ తగిలి, టీ.వి. పగిలిపోయింది. వాళ్ళ నాన్నలు కొడతారేమో, తాతయ్య అరుస్తాడేమోనని పిల్లలు పారిపోయారు. సాయింత్రానికి విషయం తెలిసిపోయింది. కొడుకులు పిల్లలకి నాలుగు తగిలించి, తండ్రిని పరోక్షంగా నాలుగు చీవాట్లు పెట్టారు. పాపం ఆయన మనసు బాధపడింది. ఆరోజు రాత్రి అన్నం తినకుండానే నిద్రపోయాడు. మర్నాడు ఉదయానికి ఆయనకు బాగా జ్వరం వచ్చింది. వారం రోజులైనా జ్వరం తగ్గలేదు. వైద్యుడు చూసి, ఈయన మనసులో ఏదో దిగులు పెట్టుకున్నారు; అందుకనే, జ్వరం పూర్తిగా తగ్గట్లేదు అని చెప్పి వెళ్ళాడు. ఈ వయసులో నాన్నకు దిగులు ఏముంటుందిలే అని కొడుకులు అంతగా పట్టించుకోలేదు. మనుమళ్ళు వచ్చి తాతయ్యను చూసిపోతున్నారు. పగలూ, రాత్రి, ఆ జ్వరంలోనే, ఆయన క్రికెట్ బౌలింగ్, బ్యాటింగ్ గురించి కలవరిస్తున్నాడు. పిల్లలూ, బాగా ఆడండి, మీకెందుకు నేనున్నానుగా! అని అంటున్నాడు. అప్పటికి వాళ్ళకు అర్ధమయ్యింది తాతయ్య దిగులు ఏమిటో! వెంటనే అందరూ మూట్లాడుకొని, వాళ్ళ నాన్నలు, అమ్మలుతో చెప్పారు తమకు అర్ధమైన రీతిలో. ఇప్పుడు కొడుకులుకూడా నిదానంగా ఆలోచించి, ఆయన్ను నెమ్మదిగా ముందు తోటలోకి తీసుకువచ్చి, కుర్చీలో కూర్చోబెట్టారు. పిల్లలు, వాళ్ళ స్నేహితులు అందరూ బ్యాటింగ్; ఫీల్డింగికి తయారయిపోయారు. తాతయ్యా నువ్వు బాల్‍వెయ్యి ఆడదాం అని అన్నారు. ముసలాయిన ఒక్కసారి అందరినీ చూసి, కొడుకుల కళ్ళల్లోకి చూసూడు. వాళ్ళుకూడా కళ్ళతోనే సమాధానం చెప్పారు. అంతే, ముసలాయినలో ఉత్సాహం వచ్చేసింది. నీరసంగావున్నా, కొంతసేపు ఆడారు; ఇక రెండు,మూడు రోజులు ఇదే తంతు. నాలుగో రోజుకి ఆయనకు జ్వరం తగ్గిపొయింది, హుషారు పెరిగిపోయింది.
సంక్రాంతి పండుగ, అందరికీ సెలవులు. ఇంట్లొఅంతా సందడి. అమ్మాయి పిల్లలు, అబ్బాయి పిల్లలు అందరూ ఇంట్లో ఒకటే అల్లరి; ఆటలూ, పాటలూ. ప్రొద్దున ఫలహారాలు అయిపోయినాయి. కొందరు హాల్లో, కొందరు మేడపైన గదుల్లో టీ.వి. చూస్తున్నారు, లేదా సీ.డీ పెట్టుకొని సినిమాలు చూస్తున్నారు. మన విద్వాంసులుగారు కూడా మనుమరాలుద్వారా జేమ్స్‍బాండ్-116; మొనగాళ్ళకు మొనగాళ్ళు; చిక్కడు-దొరకడులాంటి సీ.డి.ల్ని తెప్పించుకున్నారు. తన గదిలొ కిటికీ తెరలన్నింటినీవేసి, జేమ్స్‍బాండ్ సినిమా చూట్టం మొదలుపెట్టారు. భార్యచేత, మధ్యలో కొన్ని చక్రాలు, పంటిక్రిందికోసం, తెప్పించుకున్నారు. పళ్ళెం అందుకుంటూనే, నీవుకూడా కూర్చొని చూడరాదూ, సినిమా బాగుంటుంది అంటూ చేయిపట్టుకొని తన ప్రక్కన్నే కూర్చోబెట్టుకున్నారు. సినిమా కధ మంచి రసపట్టులోవుంది. శత్రు గూఢచారిని జేమ్స్‍బాండ్ చిత్తు,చిత్తుగా కొట్టి, కట్టేసి, తన భుజంపైకెత్తుకొని, గోడదూకి, అటువైపునవున్న కారులో పడుకోబెట్టి ముందుకు వెళ్తున్నాడు. వెనుకనుంచి తుపాకుల శబ్దాలు; వాటిని తప్పించుకుంటూ బాండ్ ముందుకు దూసుకువెళ్తున్నాడు. ఇంతలో గదిలొకి పెద్దమనుమడు వచ్చి, తాతయ్య చెవిలో ఏదో రహస్యంగా చెప్పి, బయటకు తీసుకువెళ్ళాడు. పిల్లలుకూడా, బయట దొంగ-పోలీస్ ఆట ఆడుతున్నారు. ఏంటి విషయం? అని అడిగాడు తాతయ్య మనుమడ్ని. బయట, రెండిళ్ళ మధ్యవున్న గోడ అవతల శత్రువులు ఒక వస్తువును దాచిపెట్టారు; వాళ్ళు వచ్చేలోపల, నేను దాన్ని తీసుకువచ్చేయాలి. గోడ ఎత్తుగావుంది, నాకు కష్టంగావుంది కాబట్టి, నువ్వు అటువైపుదిగి, ఆ వస్తువును నాకు తెచ్చిఇవ్వాలి అని హుషారుగా, హడావిడిగా చెప్పేసాడు. ఈ వయస్సులో ఈ పని కష్టమే. గోడవరకు వెళ్ళి, చూసి, ఆగిపోయాడు. లాభంలేదురా, కష్టం మనుమడా అన్నాడు. ఏంటి తాతయ్యా, నువ్వు ఎప్పుడూ ఆ జేమ్స్‍బాండ్ సినిమాలు, డిష్కుం-డిష్కుం సినిమాలు చూస్తావు, ఈ చిన్న గోడను ఎక్కలేవా? అని ఎగతాళి చేసినంత స్థాయిలో ప్రశ్నవేసాడు. అంతే, తాతయ్యగారి కళ్ళముందు జేమ్స్‍బాండ్-116 గోడ ఎక్కి, దూకే దృశ్యం కనిపించింది. ఒక్క ఊపులో గోడదూకి, ఆ వస్తువుని ఇటువైపున్న మనుమడికి అందించి, మళ్ళీ గోడెక్కేసి, మనుమడి కళ్ళల్లోకి చూసాడు. మనుమడు కళ్ళల్లో మెరుపు. వాడు ఆ వస్తువుని తీసుకొని పరుగెత్తాడు. రెట్టింపు ఉత్సాహంతో ఈయన గోడ దూకేసాడు. కానీ, పది నిముషాల్లో, గదిలొ మంచంమీద మూలుగుతూ పడుకున్నాడు; డాక్టరుగారు నెప్పికి సూదిమందు ఇస్తున్నారు. చాలా ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్పేసివెళ్ళాడు.
ఇంట్లోవాళ్ళంతా ఆయన చుట్టొ చేరిపోయారు. జరిగింది ఏమిటో పిల్లవాడిద్వారా తెలుసుకున్నారు. ఇదేం పనులండీ, ఈ వయసులో మీకూ అంటూ ఆయన భార్య దీర్ఘాలుతీస్తే, పిల్లలు, అవును నాన్నా, మీరేంటి చిన్నవాళ్ళల్లాగా ఇలా చేసారు అని అడిగారు. మూలుగే ఆయన సమాధానం. ఇంతలో, మనుమడు పరుగెత్తుకుంటూవచ్చి, తాతయ్యా!, నీ సహాయంతో నేను శత్రువులందరినీ ఓడిచ్చేసాను! ధాంక్స్ తాతయ్యా అంటూ చెయ్యి నొక్కాడు. నాన్నా, తాతయ్య జేమ్స్‍బాండ్‍లాగా గోడదూకి వచ్చారు తెలుసా?! అని అందరికీ చెప్పాడు. ఇదంతా విని అందరూ నవ్వుకొని, నాన్నా, మీకు జేమ్స్‍బాండ్ యుద్ధాలు, జానప చిత్రాల్లో హీరో గాలిపటంద్వారా కోటగోడలు ఎక్కటంలాంటివి ఇష్టంవుంటే, ఆ చిత్రాల్ని కూర్చొని చూడండికానీ, వాటిని ఆచరణలో పెట్టకండి, ఇబ్బంది పడతాం అందరం అనుకుంటూ వెళ్ళిపోయారు. మన విద్వాంసులుగారు భార్య కళ్ళల్లోకి చూసి, కళ్ళెగరేసారు. ( పెద్దలు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారికి కూడా జేమ్స్‍బాండ్‍లాంటి యాక్షన్ చిత్రాలంటే చిన్నప్పటినుంచి ఇష్టమని ఒక టీ.వి. షోలో చెప్పినట్లు నాకు గుర్తు ).
ప్రకృతిలో బుద్ధి జీవుల్లో మనిషి మొదటివాడు. ఇతనికి రెండు ముఖ్య లక్షణాలున్నాయి. మొదటిది అనుకరుణ; రెండవది ఆచరణ. ఒక ప్రక్రియను అనుకరిస్తూ, దానిని సంపూర్ణంగా ఆచరణలో పెట్టే సంధికాలంలో, ముఖ్యంగా, యుక్తవయస్సులో, ఆ ‘విషయ-ప్రక్రియ’పై ఇష్టాన్ని లేదా అయిష్టాన్ని ఏర్పరుచుకుంటాడు. మనసు అలవాటుపడిన ఇష్టమే కోరికగా స్థిరపడుతుంది – మనసు కలలుగంటుంది – కొన్ని కలలు కనురెప్పలను దాటి, నిజమవుతాయి; కొన్ని కలలు కలల కడలిని దాటకుండానే కలలలోనే సమసిపోతాయి; మరికొన్ని, కలల అలలలో ఉయ్యాలలూగుతూనే వుంటాయి – జీవిత చరమాంకం వరకు అవి వెంటాడుతూనేవుంటాయి.
ఆడవాళ్ళల్లోఅయినా, మగవాళ్ళల్లోఅయినా చిన్నప్పటి తీరని కోరికలు కొన్ని అలాగే ఉండిపోతాయి. కొందరికి సూటూ,బూటూ వేసుకొని తిరగాలనీ; కొందరికి డాక్టరో; పోలీస్ అధికారో, లేదా, ఉపాధ్యాయుడో కావాలని కోరికలుంటాయి. రకరకాల పరిస్థితుల దృష్ట్యా, అసక్యతవల్లగానీ, తాము చిన్నప్పుడుగానీ, ఉద్యోగం చేసే వయసులోగానీ, కలలుగన్న, కోరుకున్నవాటిని సాకారం చేసుకోలేకపొతారు. చూస్తుండగానే జీవితంలో రేపటి పరుగులో, పరుగెత్తి, అలసి, సొలసి, చివరకు విశ్రాంతి తీసుకునే దశకు వచ్చేస్తారు. కానీ, వారి మనస్సులో, వారి కోరిక ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. ఒక వయసులో, డబ్బులున్నా, సంసార బాధ్యతలవల్ల తమ కోరికలను తీర్చుకోలేరు; మలి వయసులో, వాటికోసం పిల్లల్ని అడగటానికి మొహమాటం అడ్డువస్తుంది; ఒకవేళ అడిగినా, ఈ వయసులో అవి నీకు ఎందుకు అని అన్నా అనవచ్చు కొడుకులు; కొడుకుని అడిగితే, కోడలు ఏమంటుందో; ఒకవేళ వున్న ఒక్క కూతురుని అడిగితే? – ఊహూ! అల్లుడుకి తెలిస్తే హుందాగా వుండదేమో?
ఉపసంహారం:– చిన్నప్పుడు, అందరికీ, అనేక కోరికలుంటాయి. అన్నింటినీ తీర్చుకోలేమేగానీ, కొన్నింటిని, కొంతవరకైనా నెరవేర్చుకోగలం. చిన్న పిల్లలుగా వున్నప్పుడు, మారాంచేసి, ఏది కోరినా, తల్లి,తండ్రులు వాటిని నిజంగా తీర్చటమో, లేదా, బొమ్మల రూపంలోనే వాటినిచ్చి, పిల్లల్ని ఊరడిస్తారు. చిన్న పిల్లలు-ముసలివాళ్ళు, వీళ్ళు మనసురీత్యా ఒకటేనంటారు. భౌతికంగానూ, పిల్లలు నాలుగు కాళ్ళమీద పాకుతే, ముసలివాళ్ళు కర్రబట్టుకొని మూడుకాళ్ళమీద నడుస్తారు. తమ చిన్న పిల్లల్ని, వాళ్ళ మనసెరిగి ఎట్లా వాళ్ళను చూసుకుంటారో, కొడుకులు/కోడళ్ళు/అల్లుళ్ళుకూడా పెద్దవాళ్ళయిన తల్లి,తండ్రులను గమనిస్తూ, కనిపెట్టుకుంటూ, చిన్నప్పటి నెరవేరని వాళ్ళ కోరికలేమయినా వుంటే వాటిని సాధ్యమయిన రీతిలో నెరవేరిస్తే, రెపరెపలాడే ఆ పెద్దవాళ్ళ ‘చిన్ని మనస్సులు’ ఆనందంతో, తృప్తితో నిండిపోతాయి. ప్రశాంతంగా, పసిపాపల్లా వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి. వాళ్ళ కోరికల్ని తీర్చామన్న ఆనందం, తృప్తి పిల్లలికికూడా దక్కుతాయి. నేటి పెద్దవాళ్ళే రేపటి ముసలివాళ్ళు కారా?!
నా వరకూ వస్తే – నా వయసు 57 ఏళ్ళు. ముసలివాళ్ళ తరగతిలోకి ఇంకా రాలేదనుకోండి. అయినా… … “గంట,గంటకూ కూహూ, కూహూ అంటూ శబ్దంచేసే ఒక కుకూబర్డ్ గోడగడియారం కొనుక్కోవాలని వుంది. చిన్నప్పటి కోరిక ఇది. ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇంకా…. ఒక చిన్న టెలీస్కోప్; ఒక మైక్రోస్కోప్ కూడా కొనుక్కోవాలనివుంది. ఇంకా ప్రయత్నాలు ముమ్మరం చేయలేదు. మరి మీ మనస్సుల్లోని తీరని కోరికలేవైనా వుంటే బయటపెట్టి, సాధించటానికి ప్రయత్నించండి!! శుభస్యశీఘ్రం!!

Good post.
పద్మ గారికి, నమస్కారములు.
నా వ్యాసం మీకు నచ్చినందుకు చాలా సంతోషం. చాలా కాలం తరువాత మీనుండి వింటున్నాను.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మనసు కలలుగంటుంది – కొన్ని కలలు కనురెప్పలను దాటి, నిజమవుతాయి; కొన్ని కలలు కలల కడలిని దాటకుండానే కలలలోనే సమసిపోతాయి; మరికొన్ని, కలల అలలలో ఉయ్యాలలూగుతూనే వుంటాయి
———————————————-
వావ్. జీవిత సత్యం ఒక వాక్యంలో చెప్పేశారు. కలలు లేకపోతే జీవితమేలేదు. వాటి కోసమేగా మనము జీవించేది.
శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం.
మీ స్నేహశీలి,
మాధవరావు.
పెద్దవాళ్ళ మనసుని చక్కగా ఆవిష్కరించారు. 57 కే మీరు అలా అనుకుంటే మేము 70+ వాళ్ళ అలోచనలు ఇంకా తేడాగా వుంటాయా! మనసు కలలు కంటుంది.
kastephale గారికి, నమస్కారములు.
వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషముగావున్నది. నిజ జీవితంలో, ముఖ్యంగా, నేటి పరుగులెత్తే జీవనశైలిలో, చాలా కుటుంబాలలో ఇటువంటివి జరుగుతున్నాయి. ఎవరినీ ఆక్షేపించటం నా వుద్దేశం కాదుకానీ, ఇతరుల మనసులను తెలుకోవాలనేదే నా భావన. నావరకూ, నా ఒక్కగాని అమ్మాయితో ఎటువంటే ఇబ్బంది లేదు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
రావు గారూ,
విషయం చాలాబాగా ఆవిష్కరించేరు. తెలుగులో ఈ సబ్జెక్టుమీద చాలాకాలం క్రిందట ఒక మంచి కథ వచ్చింది: అందులో కథానాయకుడు ఒక ముసలాయన. ఆయనకి చిన్నప్పటినుండీ మూడుచక్రాల సైకిలు తొక్కాలని ఉంటుంది. కానీ పేద కుటుంబంలో పుట్టడం వల్ల కోరిక నెరవేరదు. కష్టపడి పిల్లల్ని పెంచవలసిరావడంతో పిల్లలకి కూడా కొనలేకపోతాడు. ఆ కోరిక అలా అంతరాల్లో మిగిలిపోతుంది.
అయితే కొడుకుతోపాటు ఉంటున్నప్పుడు మంచి ఉద్యోగస్థుడైన కొడుకు మనవడికి ఒక మూడుచక్రాల సైకిలు కొనుక్కు వస్తాడు. అది చూసిన దగ్గరనుండి అతనిలో దాగున్న పాత కోరిక మళ్ళీ రేగుతుంది. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండడంతో ఆ కోరిక నెరవేరదు.
ఒకరోజు అందరూ సాయంత్రం సినిమాకి వెళ్దాం అని చెప్పి అతనికి ఇష్టమైన సినిమా ప్రొపోజ్ చేసినా అతను వెళ్ళకుండా ఇంటిలోనే ఉండిపోతాడు ఏదో మిష చెప్పి. అతన్ని వదలి అందరూ సినిమాకి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోగానే. హమ్మయ్య ఇక తర్వాతి మూడుగంటలూ తనవేనని అతను తలుపులుబిడాయించి తీరుబడిగా తయారై మూడుచక్రాల సైకిలు ఇక ఎక్కుదామని అనుకుంటుండగా తలుపులు దబదబా మోగుతాయి. అతను సైకిలు దాచేసి తలుపుతీసిచూస్తే, ఇంకేముంది, సినిమా టిక్కట్లు దొరకలేదని అందరూ వెనక్కి వచ్చేస్తారు.
క్లుప్తంగా ఇదీ కథ. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ బ్లాగులో ఈ విషయం చదివేను.
అభినందనలతో.
శ్రీ మూర్తి గారికి, నమస్కారములు.
చక్కటి విషయాన్ని తెలియచేశారు. మీ ఆరోగ్యం ఎట్లావున్నది?
మీ స్నేహశీలి,
మాధవరావు.
చాల బాగా చెప్పారండి. నాకు (వయస్సు 25 ) మీ పోస్ట్ వళ్ళ పెద్హలని ఎలా చూసుకోవాలో ఇంకా బాగా తెలిసింది. తెలియక ఎప్పుడయినా వారిని విసుకున్నా, ఇక ముందు ఆ తప్పు చేయబోను.
శ్రీ గోపికృష్ణ గారికి, నమస్కారములు.
మీ సహృదయానికి మనస్పూర్తిగా నా జోహారులు.
మీ స్నేహశీలి,
మాధవరావు.