భారతదేశంలో వివాహ వ్యవస్థ సమసమాజానికి, సంస్కృత సమాజానికి పునాదిలాంటిది. చక్కటి, ఆదర్శవంతమైన వివాహా జీవితం గడుపుతూ, భావిభారతాన్ని చక్కదిద్దే సంతానాన్ని అందించేదే మన వివాహవ్యవస్థ. వివాహ సమయంలో నవ వధూవరులు లక్ష్మీ,నారాయణులు; వివాహమనంతరం వారిరువురూ అర్ధనారీశ్వరులు. భారతావనిలో ఏ వివాహిత స్త్రీ, భర్తనుంచి విడాకులు కోరుకోదు. ఒకవేళ కోరుకుందంటే, ప్రధాన లోపం భర్తనుండే వుండివుండాలి. విడాకులు కోరుకోకపోవటానికి కారణం – మన పురాణాల ప్రభావమే ; మన ధర్మశాస్త్రాల ప్రభావం; మన సంస్కృతి, ఆచారవ్యవహారాల ప్రభావం. ఒక పురుషునిని మనఃస్పూర్తిగా భర్తగా స్వీకరించిన స్త్రీ, మరొకరిని స్వీకరించలేదు. అందువలనే మన వివాహవ్యవస్థ స్థిరంగా వుంటూవచ్చింది. అయితే, చాలా చిన్న వయస్సులోకానీ, నిరాధారమైన జీవనాన్ని సాగించవలసివచ్చినప్పుడు, తప్పనిసరి పరిస్థితులలో, స్త్రీ మారు వివాహానికి ఒప్పుకుంటుంది. భర్త చనిపోయినా, లేదా విడిపోయినా, తన పిల్లలకు ఆసరాగావుంటూ, వారిని ప్రయోజకులుగాచేసి, సమాజానికి అందింస్తుంది స్త్రీ. ఇది భారతదేశ స్త్రీ గొప్పతనం; ఔదార్యం.
ధర్మ, అర్ధ, కామ, మోక్షమనే నాలుగు ధర్మాలకు మన వేదశాస్త్రాలు సమానహోదాను కల్పించి, వాటిని పాటించటంలో ఎక్కువ, తక్కువలు చూపకూడదని ఉద్భోదించాయి. ఈ నాలుగు ధర్మాల్లో, ఏ ఒక్క ధర్మానికిఅయినా అధిక ప్రాధాన్యం ఇస్తే, హిందూ వివాహవ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఈ నాలుగు ధర్మాల్లో అర్ధానికి, కామానికి; లేదా రెండిటికీ మాత్రమే ఎక్కువ ప్రధాన్యం ఇవ్వటంవలననే అనేక దేశాల్లో వివాహవ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుంటాన్ని మనం గమనిస్తున్నాం. విడాకుల వ్యవహారాల్లో మన సమాజంలో పురుషులు ముందుగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కారణం, నైతిక విలువలను మరవటం; పైన చెప్పిన నాలుగు ధర్మాలను పాటించకపోవటం. ప్రతి వ్యవహారంలోనూ, ముఖ్యంగా చిక్కు వ్యవహారాల్లో, స్త్రీ ఎక్కువుగా సర్దుకుపోతూ, సమస్యకు పరిష్కారం వెదుకుతుంది; కానీ, పురుషుడు సర్దుకుపోవటానికి ముందుకు రాకపోవటంతో విడాకుల సమస్యలు పెరుగుతాయి.
భార్యా,భర్తలు – ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు; మంచి ఉద్యోగాలు కలిగివున్నారు; సంపాదన బాగావున్నది. తను ఊహించుకున్న, కోరుకున్న పద్దతిలో భర్త, భార్యనుగానీ; భార్య, భర్తనుగానీ చూడటంలేదు కాబట్టి, ఆలుమగలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు పాశ్చాత్యదేశాల్లో. పైన చెప్పిన నాలుగు ధర్మాల్లో, ఆర్ధిక, కామమనే రెండింటికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్లనే ఇట్లా జరుగుతున్నది. మళ్ళీ వివాహం చేసుకుంటే, వచ్చే భర్తగానీ, భార్యగానీ తాము కోరుకున్నట్లుగానే వుంటారు అనేదానికి అవకాశంవుందా? ఉండకపోతే, మళ్ళీ విడాకులు తీసుకోవటం పరిపాటిఅయింది. ఈలోపల వీరికి కలిగిన సంతానం మాటేమిటి? వారిపై ఈ విడాకుల ప్రభావం తీవ్రంగా వుంటుంది. నిరంతర, నిర్మలమైన తల్లి,తండ్రుల ప్రేమ వారికి కరువవుతుంది. దీని పర్యవసానం సమాజంపై పడుతుంది. ఇప్పుడిప్పుడే మన దేశంలోకూడా ఇటువంటి పోకడలు పెరుగుతున్నాయి.
మన దేశంలో నాడు, నేడుకూడా స్త్రీ, భర్తనుంచి విడాకులు కోరుకునేది చాలా తక్కువ. కారణం ఏమిటి? “ వివాహవ్యవస్థలో, చెప్పాలంటే, ఏ దేశ వివాహవ్యవస్థలోనైనా, భార్యా,భర్తల మధ్య, ప్రథానంగా వుండాల్సింది పరస్పర నమ్మకం. నమ్మకం వున్నచోట భయం, అబధ్రతలకు తావులేదు; ఒకరిపై మరొకరికి నమ్మకం వున్నప్పుడు, అక్కడ ప్రేమ చిగురిస్తుంది; ఆ ప్రేమ అనురాగానికి ఆరోహణ మెట్టుగా మలచబడుతుంది; అనురాగం మొలచిన చోట కలుపుమొక్కలు పెరగవు; అను‘రాగమతిశయించిన’ చోట నిర్మలమైన ప్రేమరాజ్యం ఒక్కటే వుంటుంది; ఆ రాజ్యానికి భార్యా,భర్తలు రాజు,రాణీలు; రాజు,రాణి తాము ధర్మాన్ని పాటిస్తూ, ఇతరులుకూడా ధర్మాన్ని పాటించేటట్లుగా చూడాలేకానీ, తామే ధర్మాన్ని తప్పకూడదు; ఈ కట్టుబాటునే, వివాహవ్యవస్థకి బాటగా మలచి, మన పెద్దలు ఎన్నో ఉదాహరణలను కథలరూపంలో చెప్పారు. ఆ కథలను అమ్మ పొట్టలోపలే ఉన్నప్పుడు విన్న భారత స్త్రీ, తన మానసంలో, పుట్టుకతోనే ఈ గుణాలను పుణికిపుచ్చుకొని ఈ లోకంలోకి వస్తుంది. ఈ లక్షణం భారత స్త్రీలకు కర్ణుడి కవచకుండలంలాంటిది. పుట్టుకతో వచ్చింది, పుడకలతోనే పోతుంది అనే సామెత మనకివుంది. ఇది అక్షరాలా నిజం. ఇది పురుషులకుకూడా వర్తిస్తుంది.
‘ వివాహం ’ అంటే అర్ధం, ‘ విశేషమైన సమర్పణ ’ అని. అంటే, కన్యాదాత, తన కూతురుని, ఒక ప్రత్యేక, సామాజిక కార్యనిర్వహణకోసం, వరునికి సమర్పిస్తాడు. వివాహం, వేడుక లేక ఉత్సవంకాదు. ఇది ఒక మహత్తర సంస్కారం. కేవలం తన కామపరితృప్తికోసం, పురుషుడు, ఆహూతులైన పురప్రజల సమక్షంలో, వారి ఆమోదంతో, స్త్రీని గ్రహించినట్లైతే, ఆ కార్యాన్ని ‘ భోగం ’ అని అంటారేకానీ, వివాహమనరు. ఒక పుత్రుని కనటంద్వారా తండ్రి, మరణానంతరం, పున్నామి నరకంనుంచి రక్షింపబడతాడు; అయితే, ఒక తండ్రి, తన కూతురుని, ఒక వరునికిచ్చి వివాహం చేయటంద్వారా, తన వెనుక, ముందు పది తరాలవారు ఉద్ధరింపబడతారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ ధర్మంలో పురుషుడు స్వకార్యం కోసమైనా, ప్రజోపకారం కోసమైనా ఏదైనా యజ్ఞ్న,యాగాదులు చేయాలంటే, ఒక ప్రత్యేక అర్హత కలిగివుండాలి. అదే స్త్రీని వివాహమాడివుండటం. స్త్రీ, వివాహం చేసుకోవటంద్వారా తన తల్లి,తండ్రులకు ఆనందం కలిగించటమేకాకుండా, తన భర్తద్వారా పుత్రసంతానాన్ని, స్త్రీ సంతానాన్ని పొంది, అత్త,మామలవారి కుటుంబానికికూడా ఆనందం, అభివృద్ధిని కలిగిస్తుంది. ఇంతటి మహోన్నతమైన సంకల్పంతో, సామాజిక స్పృహతో, నైతిక విలువలతో, ఒక భారత స్త్రీ, ఒక పురుషుడిని వివాహమాడుతుంది కాబట్టే, ఆ స్త్రీ తన భర్తనుంచి విడాకులు పొందటానికి సమ్మతించదు.
|| ధర్మార్ధ కామేషు త్వయైషా నాతి చరితవ్యా|| :ధర్మ, అర్ధ, కామముల విషయంలో భార్యను అతిక్రమించి ప్రవర్తించకు అని కన్యాదాత, వరునికి ఉద్భోదిస్తే, వరుడు, ‘నాతి చరామి’ : ఆ విధంగా ప్రవర్తించను అని ప్రమాణం చేస్తాడు. భార్యా,భర్తలలో ఏ ఒక్కరు పొరపాట్లుచేసినా, వాటిని ఎదుటివారు అర్ధంచేసుకొని, సర్దుకొని, దిద్దుబాటు చేసుకొని, ఆ తప్పులు మరలా జరగకుండా చూసుకుంటూ, వివాహ జీవితాన్ని గడపాలేకానీ, విడాకులు తీసుకొని, తమ సమస్య పరిష్కారం అయిందని అపోహపడి, కొత్త ఆనందానికి దారులు వెతకకూడదు. పురుషుడు ఈ విషయాన్ని అర్ధంచేసుకొని, ధర్మ నియమాన్ని పాటిస్తే, విడాకుల సమస్య ఉత్పన్నమేకాదు. స్వస్తి.
|| వ్రేల్లు నాటుకున్న చెట్టు, భూమాతను విడిరాలేనంది;
కడలి అలలు, చెలియకట్టను దాటలేనంది;
నదీప్రవాహం సాగరుడిని కలవకుండా వుండలేనన్నది;
చేప, నీటిని త్యజించలేనన్నది;
కనురెప్ప, కంటిని వదలలేనన్నది;
వేదశాస్త్రాలు పెళ్ళి తాంబూలాలున్నవేతప్ప, విడాకులు లేవన్నవి;
భారతావని,
లక్ష్మీ,నారాయణుల (ఆలు,మగల); శివపార్వతుల భారతమేతప్ప,
విడాకుల భారతం లేదన్నది, తప్పన్నది ||

విషయాన్ని చాలా బాగా చెప్పేరు, కాని వినేవాళ్ళు తగ్గిపోతున్నరనుకుంటా! సార్. ఈ పూట తొడుక్కున్న చొక్కా రాత్రికి వదిలేసినట్లుగా జీవిత భాగస్వాముల్ని మార్చేస్తున్న కాలం. ధన్యవాదాలు.
శ్రీ శర్మ గారికి, నమస్కారములు.
వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం.వాస్తవాన్ని నేటి తరంవారికి ఒకసారి గుర్తుచేయటమే నా ఉద్దేశ్యం.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మీరు చాలా పాతకాలంలో జీవిస్తున్నారు. You are caught in a time warp. పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మనుషుల మనస్తత్త్వాలు కూడ శరవేగంగా మారుతున్నాయి.
శ్రీ తాడేపల్లివారికి, నమస్కారములు.
మీరు చెప్పింది నిజమే. అయితే, స్థిర వేగంతో తిరిగేది గతి తప్పదు; శరవేగంతో తిరిగేది గతీ తప్పుతుంది, దారి తప్పుతుంది. అందుకనే, వాస్తవాన్ని నేటి తరంవారికి ఒకసారి గుర్తుచేయటమే నా ఉద్దేశ్యం.
మీ స్నేహశీలి,
మాధవరావు.
“….భర్త చనిపోయినా, లేదా విడిపోయినా, తన పిల్లలకు ఆసరాగావుంటూ, వారిని ప్రయోజకులుగాచేసి, సమాజానికి అందింస్తుంది స్త్రీ. ఇది భారతదేశ స్త్రీ గొప్పతనం; ఔదార్యం…”
ఆర్యా ! నేను మొదట వ్రాసిన వ్యాఖ్య ఈ పై సామాన్యీకరణం గుఱించి. మిహతా వ్యాసమంతా నాకు ఆమోదయోగ్యమే. మన భారతీయస్త్రీల మంచితనం సహజమైనది కాదు. అది ఈ దేశపు మగవాళ్ళ రోషం, పౌరుషానికి అనుగుణంగా అలవాటు చేసుకున్నటువంటిది. ఈనాటి మగవాళ్ళు (అది తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, భర్త కావచ్చు, ప్రభుత్వం కావచ్చు) ఆ పట్టుని కాస్త సడలించగానే ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా చెడిపోతున్నారు. Subordination అనేది మనుషుల్లో కొన్ని సద్గుణాల్ని పెంపొందిస్తుంది. ఆ సబార్డినేషన్ పోగానే ఆ సద్గుణాలు కూడా ఆటోమ్యాటిగ్గా పోతాయి. ఇప్పుడు భారతీయస్త్రీల విషయంలో జఱుగుతున్నది ఇదే.
శ్రీ తాడేపల్లిగారికి, నమస్కారములు.
మీ లోతైన వ్యాఖ్యలు తప్పకుండా ఆలోచించతగ్గవే.
మీ స్నేహశీలి,
మాధవరావు.
సబార్డినేషన్ పోగానే అన్నారు, ఎందుకు పోతున్నది..ఎవరు బాధ్యులు , భారతీయస్త్రీలేనా ?
వివాహం అనేది ఒక నమ్మకం, ఒక సర్దుబాటు, ఒక responsibility! ఈ మూడిటినీ అర్ధం చేసుకున్న వాళ్ళు, స్త్రీ అయినా పురుషుడైన, అంత తొందరపడి విడాకులకు వెళ్ళరు. వెళ్ళారంటే, నమ్మకంలోనో, సర్దుబాటులోనో ఏదో ఇక ఎంతమాత్రమూ భరించలేని proportions లోకి వెళ్ళివుంటేనే అని నేననుకుంటాను. ఏదైన, ఇలాంటి విషయాలన్నీ చాలావరకూ personal situations పైనా, judgement పైనా అధారపడి కూడా వుంటుంటాయి. ఒకటి మాత్రం నిజమనిపిస్తుంది – కూర్చుని కాస్త నింపాదిగా, emotions నీ అనవసర పట్టుదలలనూ పక్కనబెట్టి ఆలోచించగలిగే లక్షణం కొరవడడం అన్నది. generalisations చెయ్యలేము, ఎవరి personal reasons వాళ్ళకుంటాయి. కానీ, విడాకుల తరువాత జీవితం, ఇద్దరికీ, అదీ అప్పటికే పిల్లలున్నట్లయితే, అంత సులభం కాదనుకుంటాను. What about memories? పిల్లలన్నది ఒక physical act మాత్రమే కాదు గదా!
వ్యాసం బాగుంది. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
శ్రీయుతులు వెంకట్ బి.రావుగారు; లక్కరాజుగారు; తాడేపల్లిగారు; మౌళిగార్లకు,
మీ అందరికీ నా నమస్కారములు, మరియు నూతన సంవత్సర (ఆంగ్ల) సుభాకాంక్షలు.
ఈ విడాకులు వ్యాసాన్ని ఇప్పటివరకు 148 మంది చదివారు. దీనిపై మీరు మీ చక్కటి అభిప్రాయాల్ని తెలియచేసారు. ధన్యవాదములు.
శ్రీ వెంకట్‍గారు, తమ వ్యాఖ్యలో ‘వివాహం అనేది ఒక నమ్మకం, సర్దుబాటు, బాధ్యత’ అని వ్రాసారు. ఇది అక్షరాలా నిజం; వివాహితులు అందరూ అర్ధంచేసుకోవాలిసిన మరియు పాటించవలసిన విషయం; శ్రీ లక్కరాజుగారు అన్నారు:‘ఆర్ధిక స్వాతంత్ర్యం’ కూడా విడాకులు విషయంలో దోహదమవుతున్నది”. ఇది నిజమే. మితిమించిన ఆర్ధిక స్వాతంత్ర్యం నేటి యువతరాన్ని పెడదోవ పెడుతున్నాయి. మరొక విషయం ఏమన్నారంటే, ‘నాకు ఇష్టమున్నా లేకపోయినా, నా ప్రాజెక్ట్ లీడర్ మాటను వింటాంగానీ, నా భర్త (భార్య) మాట ఇష్టంలేకపోతే వినవలసిన అవసరం లేదు’. — ఉద్యోగ అవసరం (compulsion) వలన మనం లీడర్ మాటను వింటున్నాము; ఇదే భార్యా,భర్తల విషయానికి వచ్చేటప్పటికి, వారిలో ‘పరస్పర అవగాహన పెంచుకుంటూ’, కలసివుంటే కలదు సుఖం అనే ఒక compulsion పెరిగితే, విడాకుల సమస్య దూరం అవుతుందని నా నామ్మకం; ఇక, శ్రీ తాడేపాల్లివారు తమ వ్యాఖ్యల్లో, ‘ పురుషుడు, స్త్రీపై తన పట్టును ఎప్పుడు సడలిస్తాడో, అప్పుడు, పురుషులతో సమానంగా స్త్రీ కూడా చెడిపోతుంది’ అని అన్నారు. దీనిపై శ్రీ మౌళిగారు కూడా ప్రశ్నించారు. నా ఉద్దేశ్యంలో, వివాహబంధంలో, స్త్రీ పై పురుషుడి ఆధిపత్యం వుండటం అనేది, చైనా, రష్యా లాంటి దేశాల్లో సైనిక పాలనవంటిది. ప్రజల స్వాతంత్ర్యాన్ని నొక్కిపెట్టి, సైనికపాలన కొనసాగిస్తే, ఓపికపట్టలేని స్థితి, సమయం వచ్చినప్పుడు, ఎవరూ ప్రజలను ఆపలేరు. ఈమధ్యనే మనం అనేక దేశాల్లో దీన్ని చూసాము.
నేడు నోటితో లెక్కలు చేయటం అనేది పూర్తిగా పోయింది, calculators ఆ స్థానాన్ని ఆక్రమించాయి. వాటిని ఎంతవరకు వాడాలో తెలియకపోవటంవలన, అవి లేనప్పుడు, లేదా అందుబాటులో లేనప్పుడు, లెక్కలు చేయాల్సివస్తే, యువతరం ఇబ్బందిపడుతున్నారు; నేటి యువతలో, ఉదాహరణకి, computer science చదివే విద్యార్ధులకి, ఆ ఒక్క విషయంలో తప్ప, ఇతర విషయాలపట్ల ఎటువంటి అవగాహన, జ్ఞానం వుండటంలేదు; తమ చుట్టూ జరుగుతున్న ఆర్ధిక, రాజకీయ, సామాజిక విషయాలపట్ల అవగాహన లేమి వుంటున్నది; దీనిని పోగొట్టటానికి పెద్దలు నేటి యువతరానికి సహాయం చేయాల్సివుంది; fastfood centre లో నచ్చినవాటిని తీసుకొని, నచ్చనివాటిని వదిలేసినట్లు, వివాహ విషయంలోకూడా నేటితరం అదేవిధంగా ప్రవర్తిస్తున్నది. దీని విషయంపై ఏది మంచిది, ఏది చెడ్డది అనేది “పెద్దలు, మేధావులు, స్వామీజీలు” నేటి యువతరానికి తెలియచేయాలి. నేటి యువతరం శరవేగంతో పరుగెత్తుతున్నది, మనం ఏమీ చేయలేమనకుండా పెద్దలు తగిన సలహాలను యువతరానికి ఇవ్వాలి. లేకపోతే, మన పెద్దల తదనంతరం, నేటి యువత, వాళ్ళు దారి తప్పినప్పుడు, నష్టపోయినప్పుడు, మా పెద్దలు మాకు మంచి,చెడు అప్పుడే చెప్పివుంటే బాగుండేదికదా! అనే అవకాశం వున్నది. ‘ కాకినాడలో ఒక పీఠాధిపతి, యువ స్వామీజీ శ్రీ పరమానంద, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో, నేటి యువతకు ఎన్నో విషయాలపై బోధనలను చేస్తున్నారు. ఇది ఎంతో హర్షించతగ్గ విషయం.
ఇవి నా భావాలు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మీరు చెప్పినది ఆదర్శవంత మైన వివాహం. పూర్వం ఎక్కువగా ఉండేవి ఇప్పుడు తగ్గిపోతున్నాయి.
ప్రతీ వాళ్ళకీ జీవితంలో ఊహా జనితమయిన కోరికలు కొన్ని ఉంటాయి. ఇవి ఏర్పడటానికి కారణం వాళ్ళు రోజూ చూసే, వినే, చదివే వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ కోర్కెలు తీర్చు కోటానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అల్లాగే వివాహంలో కోర్కెలు కూడా .
ఒకప్పుడు వివాహం గురించి కనే కలలు వాళ్ళ ఇంట్లోనూ బయట (స్నేహితులు, చుట్టాలు వగైరా ) గమనించగా వచ్చేవి. ఇప్పుడు ఆ కోరికలు రావటానికి ఏర్పడిన వాతావరణం ఊహించుకోటానికి అంతే లేదు. ఆ భార్యా భర్తల కోరికలు చాలావరకూ ఒకటయితే ఒకటిగా ఉంటారు లేక పోతే విడిపోతారు. కారణం ఆర్ధిక స్వాతంత్రం. నా ప్రాజెక్ట్ లీడర్ మాట నాకు ఇష్టమున్నా లేక పోయినా వింటా గానీ నా భర్త (భార్య) మాట ఇష్టం లేకపోతే వినవలసిన అవుసరము లేదు.
మీరు ప్రస్తావించిన పిల్లల ప్రారబ్ధం కూడా వారి కోరికల్లో ఒకటయితే కలిసి ఉంటారు లేకపోతే విడిపోతారు.
sir, very well focussed about the marietal relationships. I am feeling somemore research has to be done and added with modern implications,with out sacrificing the principle of living together with
love
శ్రీ రాయుడు గారికి, నమస్కారములు.
వ్యాసం మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.
మీ స్నేహశీలి,
మాధవరావు.
A good and educative discussion. Thank you all
prastuta kalamlo tappu adavallada magavallada annadi kadu samsya
iddariki korikalu adikam ayyayi .magavadi alochana dorannilo marpu ledu kevalam adavalla alochana vidanam lo vachhina marpu valle inni vidakula kesulu. sarduku poyee tattvam mukyamga adavallalo taggi povadame samasyaku karanam.dabbu chala marpu techhindi sulabhamga dabbu sampadimcha galgadam to enjoymentee jivitamane kothha ardhanni istunnaru adavallu