‘ప్రజాస్వామ్యం’ అంటే ఏమిటి? వేదికపైనున్న పెద్దలొకరు సభలోవున్న యువతను అడిగారు. ఒకతను లేచి, పాఠాల్లో చదువుకున్నదాన్ని, ప్రజలకోసం, ప్రజలచేత …. అంటూ సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రభుత్వం సమాంతరమైన రైలు పట్టాలులాగా ముందుకు సాగుతుంటాయి అంటూ ముగించాడు తన సమాధానాన్ని. మరొక యువకుడు లేచి నిర్వచినం చెప్పాడు. అతనికి అందరూ బాగా చప్పట్లు కొట్టారు. ఇతను భవిష్యత్‍లో గొప్ప రాజకీయ నాయకుడవుతాడు అని జోష్యం చెప్పారు. ఇంతకీ అతను చెప్పిందేమిటంటే:- ప్రజాస్వామ్యంలో ప్రజలందరి భాగస్వామ్యం ఉంటుంది; ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతి‘నిధులు’ ప్రభుత్వాన్ని నడుపుతారు; ప్రజలనుంచి నిధులను పన్ను రూపంలో సేకరించి, తిరిగి వాటిని ప్రజోపకరమైన పనులకోసం ఖర్చు చేస్తారు; అంటే, ప్రజలనుంచి వచ్చిన సొమ్ము, తిరిగి, ప్రజలవద్దకే వెళతాయి; వెళ్ళాలికూడా. ( మనలోమాట! :- ప్రజలనుంచి వసూలుచేసిన పన్నులో సింహభాగం బీద,బిక్కి, నిరుపేదలకు చేరుతుంది; వారిపేరుతో పధకాలను సృష్టించి, నిధులను (దుర్)వినియోగం చేసి, సింహభాగంలో సింహభాగం ప్రజాప్రతినిధులు తమ జేబు నింపుకుంటారు; ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం అని మనమేకదా చెప్పుకున్నాం! పేదవారి కోపం పెదవికి చేటన్నరు ప్రజాప్రతినిధులు; అందుకే పేదలు పెదవి విప్పలేరు. ఇక, నిధుల్లో మరొక సింహ భాగం బాగా ధనవంతుల వర్గానికి అందుతాయి; మరి వారేకదండీ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేది! వీరుకూడా పెదవి విప్పరు, పైగా పెదవిపై వేలు వేసుకొని వుంటారు. ఎవరైనా సభలో చూస్తే, చూసారా, అంత పెద్దవాడైనా (డబ్బునవాడైనా), ఎంతో వినయంతో నోటిమీద వేలు వేసుకుని మరీ కూర్చున్నాడు బుద్ధిమంతుడులాగా అని వారికే కితాబు ఇస్తారు. ఇక మిగిలింది మధ్యతరగతివారు. వీరి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క లాంటిది. ఇంతకంటే వివరంగా చెప్పనక్కరలేదనుకుంటా! ). … ఆ విధంగా అతను సమాధనమిస్తూ, ఇంకా ఏమన్నాడంటే, మరి ప్రజల సొమ్ము, ప్రజలవద్దకే చేరాలంటే, ప్రజాస్వామ్యాన్ని రైలుపట్టాలతో పోల్చకూడదు; పట్టాలు ఎంత దూరం అయినా కలవవు; ప్రజలు, ప్రజల సొమ్ముకూడా ఎప్పుడూ, లేదా భాగస్వామ్యం పొందవు. కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని ఒక గుండ్రంగా గీసిన గీతగా అభివర్ణించాలి. ఒక బిందువునుంచి గీత గీసినా, అది చివరకు ఆ బిందువులో కలిసిపోయి, తుది,మొదలు తెలియవు; అదేవిధంగా, ప్రజలు, పన్నులు, ప్రజాప్రతినిధులు ఈ గుండ్రంగా గీయపడిన గీతలాంటివారు; పన్నులరూపంలో సొమ్ము ప్రజలనుంచి విడివడి, ప్రజాప్రతినిధులకు చేరి, తిరిగి (తమ)ప్రజలవద్దకే చేరుకుంటాయి. ఇదే ప్రజాస్వామ్యంలో అసలైన, సిసలైన ప్రజాభాగస్వామ్యం’ అంటూ తన ఉపన్యాసాన్ని ముగించాడు.
పై ఉ(దుర్)ద్బోధనని ఎంతోమంది ‘గీతోపదేశం’గా భావించి, నేటి తాజా రాజకీయాల్లో అమలుపరుస్తున్నారు. అందులోంచి పుట్టుకొచ్చిన పధకమే ‘బీ.ఓ.టి.’ (Build, Operate, and Transfer). అందరికీ తెలిసిందైనా, సూక్ష్మంలో చెప్పాలంటే, ఒక జాతీయ రహదారో; ఒక జాతీయ నీటి ఆనకట్టనో నిర్మాణం చేయాలనుకోండి; ప్రభుత్వం, ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది. మీ స్వంత డబ్బులతో రోడ్డుని నిర్మించండి; దానికయిన ఖర్చు ( ప్రజాప్రతినిధులకిచ్చే విరాళంతో సహా కలిపి! ), పెట్టుబడిపై వడ్డీ ఖర్చు, మీకు కొంత స్వంత వ్యాపార లాభం అన్నింటినీ కలిపి, ఆ మొత్తాన్ని ఒక పాతిక సంవత్సరాలలో, కొంచెం,కొంచెంగా, ప్రజలనుండి ‘టోల్‍టాక్స్’ రూపంలో వసూలు చేసుకోండి; పాతిక సంవత్సరాల తరువాత ఆ రోడ్డు, దాని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వానికి అప్పచెప్పండి. ఇది టూకీగా బీ.ఓ.టి. అంటే.
అన్నట్లు, ఇక్కడ మీకొక తమాషా విషయం చెప్పాలి. మనిషి చనిపోయిన తరువాత, అతనిని ఇంటి దగ్గరనుంచి, శ్మశానానికి తీసుకువెళ్ళే దోవలో, ఐదుసార్లు పాడెను క్రిందకు దించి, మళ్ళీ ఎత్తుకొని ముందుకు తీసుకువెళ్తుంటారు. అతడు చనిపోయాడని భ్రమపడ్డామేమో! అతను మళ్ళీ లేస్తాడేమో! అనే ఒక ఆశతో! బీ.ఓ.టి. పద్దతిలో నిర్మించిన రహదారిపై వాహనదారులనుకూడా ఐదారుచోట్ల ఇదేవిధంగా ఆపుతుంటారు. మొదటి గేటు దగ్గర పన్ను కట్టకుండా తప్పించుకున్నా, రెండో గేటు దగ్గర వసూలుచేస్తారు; అట్లా ఆఖరు గేటువరకు చెక్ పెడుతూనే (చేస్తూనే) వుంటారు. ఇందులో ఒక గొప్ప మర్మంవుంది. ఈ రహదారిపై, ముందుకు వెళ్ళటానికి, తిరుగు ప్రయాణానికి కలిపి టికెట్టు తీసుకుంటే వాహనదారుడికి కొంత పన్ను భారం తగ్గుతుంది, కానీ, గుత్తేదారుడికి కొంత నష్టం. అదే ముందుకు వెళ్ళటానికి మాత్రమే టికెట్టు తీసుకుంటే వాహనదారుడికి పన్ను భారం ఎక్కువ; గుత్తేదారునికి లాభం. ఐదు గేట్ల దగ్గరకూడా ఎందుకు చెక్ చేస్తారంటే వాహనదారుడు, తన ప్రయాణంలో ఒక జాతీయ రహదారినుంచి మరొక రహదారిపైగా ప్రయాణిస్తుంటాడు. ప్రతి రహదారిపైనా టోల్‍టాక్స్ కట్టాల్సిందే! ఈ టోల్‍టాక్స్ దెబ్బలకు ప్రయాణికుడు ఠపీమంటాడా? లేక బట్టగట్టి ముందుకు వెళ్ళే పరిస్థితిలో వున్నాడా? అని చెకు చేసుకోవటానికే!!
“ ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది!! ”. ఇది ఒక సెల్‍ఫోన్ కంపెనీవారి వాణిజ్య ప్రకటన. ఇందులో చాలా దూరాలోచనవుంది. ఒక మంచి ఆలోచన రావాలేకానీ, జీవితమనే బండిని బ్రతుకు అనే బాటపై ఎడాపెడా మనం నడిపించేయవచ్చు సుమండీ! ఇదే ఆలోచన ఆధారంగా, ఈ మధ్యనే, నేటి దేశ,కాల,మాన,పరిస్థితులను బట్టి ఒక యువ రాజకీయ నాయకుడుకి ఒక సరికొత్త ఆలోచన మెదడులో మెరిసింది. అదేంటో చూద్దామా!!
అది ఆసియా ఖండం; అందులో భారతదేశం; అందులో దక్షిణ భారతదేశం; అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ( గమనిక: ఈ రాష్ట్రానికి పశ్చమాన, అంటే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు – ఆ సరిహద్దు, ప్రజాస్వామ్యంలో, ప్రజాభాగస్వామ్యంలో, కొంతమేర చెరిగిపోయింది! )
మనకందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య దేశంలో ఆర్ధిక నేరాలు ఎక్కువై, పెద్ద,పెద్ద (రాజకీయ) నాయకులు చట్టానికి చిక్కిపోతున్నారు. ప్రభుత్వం చాలా చురుకుగా పనిచేస్తున్నది అనటానికి నిదర్శనం సీ.బి.ఐ. అనేకమంది నాయకులని అరెస్ట్‍చేసి, కారాగారాల్లో నెలలతరబడి వుంచుతున్నది. నాయకులతోపాటు ఉన్నతాధికారులుకూడా జైల్లోకి వెళుతున్నారు. జైలుకు వెళ్ళుతున్న ప్రతి నాయకుడు, అధికారి పెద్ద హోదాతో, పలుకుబడి వున్నవారు; విలాసవంతమైన జీవితం గడిపేవారే! ఇందులో ఆశ్చర్య పోవలిసినదేమీలేదు. ఇక్కడే కధలో మలుపు, మెరుపు. ఈ పెద్ద,పెద్ద నాయకులు, అధికార్లందరూ, జైలు శిక్ష పడిన తరువాత, న్యాయమూర్తిముందు, తాము పెద్దవాళ్ళం (వయసులో కాదు) కాబట్టి, ప్రభుత్వాన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా నడపటంలో ‘భాగస్వామ్యం’ వున్నవాళ్ళంకాబట్టి, జైల్లోకూడా తమను ‘ప్రత్యేక హోదా’గల వ్యక్తులుగా గుర్తించి, మొదటి తరగతి వసతులను కల్పించవలసినదిగా కోరుతున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అని పెద్దలన్నారు. అసలే మన కారాగారాలు ఆంగ్లేయులు కాలంనాటివి. వసతులు తక్కువ. అందరికి ప్రత్యేక వసతులున్న గదులను కేటాయించాలంటే జైలు అధికారులకు కష్టంగానే వున్నది. ఒకరిని ఒకరకంగా, మరొకరిని ఇంకొక రకంగా ‘ట్రీట్‍మెంట్’ చేస్తే రేప్రొద్దున ఎటొచ్చి ఏమవుతుందో? “ నేటి జైల్లోవున్న నాయిక-ఖైదీనే, రేపటి రాష్ట్ర ముఖ్యమంత్రి ” కూడా కావొచ్చునేమోకదా!! అందుకని, వారి భయం వారిది. అట్లాఅని, అందరికీ కోరుకున్న వసతులు కల్పించలేరు మరి!
మొదట్లో ఒక యువకుడు ప్రజాస్వామ్యం గురించి చెప్పిన విషయాలు గుర్తున్నాయికదా? ఆ యువకుడే వ్యాపారాలు చేస్తూ, రాజకీయాల్లోకి కూడా ప్రవేశిస్తున్నాడు. అతనికి వచ్చిన ఒక గొప్ప ఆలోచనే ఈ క్రొత్త పథకం:– ‘ బీ.ఓ.టి. ’ పద్ధతిన రాష్ట్రంలోనూ, దేశం మొత్తంమీదానూ కారాగారాలు కట్టించి, అందులో ( మూడునుంచి ఐదు నక్షత్రాల, వద్దులేండి, ఇదీ మరీ వినటానికి, చూటానికి బాగుండదు ప్రజాస్వామ్యంలో!! ) ఒకటి నుంచి మూడు నక్షత్రాల హోదా, వసతులుగల గదులను నిర్మించటం; 14 సంవత్సరాల తరువాత (జీవితఖైదుకాలం) వీటిని బీ.ఓ.టి. పద్ధతిలో ప్రభుత్వానికి అప్పగించటం ”.
పెద్ద,పెద్ద రహదారులు, నీటి ఆనకట్టలు, విద్యుత్ కేంద్రాలు, హోటళ్ళు, సూపర్ బజార్లులాంటివి కట్టటానికి ఎవరైనా ముందుకు వస్తారుగానీ, కారాగారాలను బీ.ఓ.టి. పద్ధతిన కట్టటానికి ఎవరు ముందుకు వస్తారు? ఇది పెద్ద సమస్యే! కానేకాదు. తమ వ్యాపారాలకు రాష్ట్ర సరిహద్దులు హద్దులు హద్దులేకావు, ఆకాశమే హద్దు అనేవాళ్ళు; శబ్ద తరంగాలకు హద్దేమిటి? సహజసిద్ధమైన వాటిని అందరికీ పంచితే తప్పేమిటి? అనే వాళ్ళకు; లక్ష్మి చంచలమైంది, నీదగ్గర వున్న ధనం, ఏదోవిధంగా నాదగ్గరకువస్తే తప్పేమిటి? అన్నిట్లో ప్రజాభాగస్వామ్యం కనబడటంలేదా? అనేవాళ్ళకు; ప్రజలకోసం ప్రభుత్వం వున్నప్పుడు, ప్రజల పనులను వారికి ఇష్టమైన పద్ధతిలో చేసిపెట్టటంలో తప్పేమిటి? భయందేనికి అనేవాళ్ళకు ఇది సమస్యేకాదు! ఏదో ప్రజలు అపోహపడి, ఆర్ధిక నేరాలు చేసారని అభియోగం వేసినంత మాత్రాన అది తప్పు అయిపోలేదుకదా? ఋజువు కావాలికదా? అప్పటివరకూ, జైల్లో ప్రత్యేక వసతులులేని సెల్లో, సెల్ (సెల్ ఫోన్) కూడా లేకుండా ఎట్లాగడపాలి? అందుకనే, ఈ పై వర్గం వారందరూ కలిసి, ఒక బృందంగా (కన్‍సార్టియం) ఏర్పడి, బీ.ఓ.టి. పద్ధతిలో కారాగారాలు కట్టించటానికి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారుట!! ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం! ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది!!

మిత్రులు మాధవరావుగారు,
నిజంగానే వొక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. కాని ప్రభుత్వ ఐడియాలు ప్రజలను దోచుకోడానికి వుపయఓగ పడుతున్నాయి కదు సార్.
కష్టెఫలే గారికి, నమస్కారములు.
మీరు చెప్పింది నిజమే. అయితే, ఇక్కడ, ఈ వ్యాసంలో కొత్త పధకాన్ని మొదలుపెడుతున్నది ఒక యువ నాయకుడు, ఇతర నాయకులు. ప్రభుత్వంతో భాగస్వామ్యం పెట్టుకుంటారు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
could not read this script.