ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ….
ముందుమాట:- సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది పల్లెటూర్లు; పచ్చని పంటపొలాలు; చిరునవ్వులు చిందించే రైతన్నలు. పంటలు సమృద్ధిగా పండి, రైతన్నలు సుభిక్షంగా, ఆనందంగా వుండటం మనం చూసాం; కొన్నిసార్లు కరువుకాటకాలతో రైతన్నలు ఖిన్నులైవుండటాన్నీ చూసాం గతంలో. అయితే, నేటి పరిస్థితులలో, నదీజలాలు తగినంతలేక, నీటి బావులపై ఆధారపడిన రైతు, విద్యుత్ కోతలతో సతమతమవుతూ, ఆత్మహత్యలకు బలిఅవుతున్నాడు. అంటే, సంక్రాంతి కొంత కళను పోగొట్టుకుంటున్నది. ఇది మనందరికీ బాధాకరమే. అయితే, ఇటువంటి పరిస్థితులు రాకుండా, లేకుండా, రైతన్నల జీవితాలలో ఇకనుంచి మళ్ళీ ‘సంక్రాంతి’ వెలుగులు చిమ్మాలని ఆకాంక్షిస్తూ… … … మునుపు నేను చూసి, అనుభవించి, వర్ణించి, ప్రచురించిన ఆ సంక్రాంతి శోభను మరొకసారి మీముందుకు తీసుకువస్తున్నాను. ఇక ముందుకు చదవండి …
సంక్రాంతి పండుగ. ఒక్క రోజుకోసం మా ఊరు గుంటూరు వెళ్ళివచ్చాను. నా చిన్నప్పడు, అరవై-డెబ్భై ప్రాంతాల్లో, గుంటూరు పట్టణంలోకూడా, గ్రామాల్లో కనిపించేంత పండుగ వాతావరణం కనబడేది. అందరి ఇళ్ళముందు ముగ్గుల రంగవల్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు; గొబ్బెమ్మల్లో గుచ్చిన ఎర్రమందారాలు, బంతిపూవులు. అదొక వింతైన శోభ. ఇంకా మంచు పడుతుండగానే, నులివెచ్చని సూర్యకిరణాలు వచ్చీరాకముందే, హరిదాసులు పాటలు పాడుకుంటూ, మధ్యమధ్యలో, “హరిలోరంగ హరి” అని పెద్దగా ఎలుగెత్తుతూ, ఇంటింట ఇచ్చిన బియ్యం, పప్పుల్ని తీసుకొని, దీవించి వెళ్తూవుండేవారు. ఆ సంగతులన్నీ నా మదిలో మరొకసారి మెదిలాయి. కానీ, సమయంలేక, మర్రోజు ప్రొద్దునే రైలెక్కి హైద్రాబాద్ రావాల్సివచ్చింది.
ప్రొద్దున్నే పల్నాడు రైలు ఎక్కి బయలుదేరాను. చాలా చలిగా వుంది. ఎవరూ రైలు కిటికీలు తెరవటంలేదు. వేడివేడి కాఫీ తాగుతున్నారు. నేను మాత్రం కెటికీ తెరిచి, కదులుతున్న రైలు నుంచి ప్రకృతి అందాలను చూస్తున్నాను. నెమ్మది, నెమ్మదిగా బాల సూర్యుని కాంతి కిరణాలు, తెల్లని మంచు తెరలను కరిగిస్తున్నాయి. భూమాత తెల్లని మంచు దుప్పటితో కప్పినట్లుంది. ఏడు గంటల సమయమయింది. రైలు పట్టాలవెంబడి గ్రామాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో పండగ సందడి కనిపిస్తున్నది. చిన్న,చిన్న గుడిసెలకు, మిద్దెలకు, చిన్న మేడల గుమ్మాలకు రంగురంగుల బంతిపూల తోరణాలు కట్టబడివున్నాయి. వరి, జొన్న కంకులను గుమ్మాలకు వ్రేలాడదీసారు. ప్రతి ఇళ్ళు ఒక కొత్త పెళ్ళికూతురు ముస్తాబై వున్నట్లుగా అనిపించింది నాకు. రంగురంగుల పరికిణీలు కట్టిన ఆడపిల్లలు హుషారుగా ఊళ్ళో తిరుగుతున్నారు.
ఇంకా వివరంగా చూడాలన్నా రైలు వేగంగా పరుగెడుతున్నది. ఒక గ్రామం దాటగానే, చాలా దూరంవరకు పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. మరల చిన్న,చిన్న గ్రామాలు వస్తున్నాయి. చెట్లు పెరిగి వుంటంలో, కొన్ని గ్రామాలు కనిపించటంలేదు. కేవలం ఇళ్ళళ్ళనుంచి వంట పొగ మాత్రం కనిపిస్తున్నది. ఇక నా దృష్టి పొలాలమీద పెట్టాను. అప్పటికే, పొలాల్లో పనులు జరుగుతున్నాయి. చాలాచోట్ల వరి కోతలు అయిపోయినట్లున్నాయి. పొలం మధ్యలో కోసిన వరిపంటను ఎత్తుగా గుడిసెల్లాగా వేసివుంచారు ఎండటానికోసమని. ఇంకా వరికోతలు కోయని పొలాలు ఆకుపచ్చని తివాసీలాగా కనిపిస్తున్నాయి. భూదేవి, సంక్రాంతి లక్ష్మీ రూపంలో, ఆకుపచ్చని పట్టుచీరె కట్టుకొని వచ్చిందా అన్నట్లు భూమి కనిపిస్తున్నది. చేల గట్లెంబడి విరగబూసిన రంగురంగుల బంతిపూలు ఆ సంక్రాంతిలక్ష్మి కట్టుకున్న ఆకుపచ్చని చీరెకు అంచుల్లాగా కనిపిస్తున్నాయి. ఏదో తెలియని అనుభూతి. ఒక్కసారి గుండెలనిండా గాలి పీల్చుకున్నాను దీర్ఘంగా. గుండెలు చల్లటి గాలితో బరువెక్కాయి. ఒక్కసారి చలికి వళ్ళు జలదరించింది. అయినా ఏదో సంతృప్తి ఆ భూదేవిని చూస్తుంటే. వరి పొలాలు ప్రక్కనే మిరపతోటలు. ఆకుపచ్చని ఆకులు, పండిన ఎర్ర మిరపకాయలు. వాటిని చూస్తుంటే, సంక్రాంతిలక్ష్మి తన జడలో ఎర్రని మందారాలను తురుముకున్నట్టు అనిపించింది. బహుశా, ఈ భూదేవి సింగారాన్ని చూసే, ఆడవాళ్ళు సింగారాన్ని నేర్చుకున్నారేమో అని అనిపించింది. ఈ రంగుల సింగారాన్నేజూసి, బహుశా, సాలెవాళ్ళుకూడా తాము నేసే బట్టలకు రంగులద్దటం నేర్చుకున్నారేమో?! నా మనసు రైలు పరుగిడుతున్నంత వేగంకంటే వేగంగా పరుగెడుతూ, వేగంగా వెనక్కివెళ్ళిపోతున్న నేలను, ఆ ప్రకృతి పరిసరాలను చూసేస్తున్నది. ఆశ్చర్యం!! పగటిపూట నక్షత్రాలు. అదికూడా నేలమీద!! మిలమిలా మెరిసిపోతున్నాయి. ఆశ్చర్యం, అనుమానంతో ఒక్కసారి ఆకాశంలోకి తొంగిచూసా రైలు కిటికీనుంచి. ఆకాశం వెల,వెలబోతున్నది. పైనుండే నక్షత్రాలన్నీ సంక్రాంతిలక్ష్మిని దగ్గరనుండి చూడటానికే అన్నట్లు భూమ్మీదకు వచ్చేసాయి. ప్రకృతి గొప్పతనం! నేలమీద నక్షత్రాలేమిటి అని మీరుకూడా ఆశ్చర్యపోతున్నారుకదూ! నిజమే. పత్తిచేలు. ఆకులు చాలావరకు రాలిపోయివున్నాయి. కాన్పుకు సిద్ధంగావున్న స్త్రీ ఎట్లా వడబడిపోయివుంటుందో, పత్తిమొక్కలుకూడా అట్లాగావున్నాయి. అయితేనేమి, పుట్టబోయే బిడ్డని తలుచుకుంటే ఆమె కళ్ళళ్ళో కాంతులు. పొట్ట విప్పుకొని, తెల్లగా పండిన పత్తికూడా అట్లాగే వెలుగులు జిమ్ముతూ, నేలకు దిగిన నక్షత్రాల్లా కనిపిస్తున్నది. పొలాల మధ్య, చిన్న,చిన్న పిల్ల కాలువల్లో, గల,గలమంటూ ప్రవహిస్తూన్న నీటి శబ్దం, సంక్రాంతిలక్ష్మి చేతికి వేసుకున్న గాజుల శబ్దంలా వినిపిస్తున్నది. పైరగాలి శబ్దం, ఆ సంక్రాంతిలక్ష్మి మానవాళికి, సమస్త జీవకోటికి శుభం పలుకుతూ పాడుతున్న పాటలాగావుంది. మరొకసారి నా ఒళ్ళు జలదరించింది. మరొక్కసారి ఆమెను నిశితంగా చూసాను. పండిన పసుపుతోట మొక్కల ఆకులు, పసుపచ్చని రంగులో మెరుస్తూ, సంక్రాంతిలక్ష్మి కాళ్ళకు రాసుకున్న పసుపు పారాణిలా కనువిందుచేస్తున్నాయి. మరి ఆమె కళ్ళు? ” నా కనులె మీ కనులగా చేసుకొని” చూడమని చెపుతున్నట్లుగా అనిపించటంలేదా ఈ శోభనంతటనీ చూస్తుంటే!! అక్కడక్కడా వున్న మోదుగ చెట్ల పువ్వుల ఎర్రని ముఖాలు ముడుచుకుపోయి వున్నాయి. ప్రక్కనేవున్న తాటిచెట్లు అడిగాయట ఎందుకట్లా వున్నారని? మేమందరం ఒక పెద్ద వడ్ఢాణంగా తయారయి, సంక్రాంతిలక్ష్మిని నడుముకు అలంకరించుకోమని అడిగాం. ఆమె సరేఆన్నది. కానీ ఏం లాభం? ఆమె నడుముకు మేం సరిపోవటంలేదు. ఏం చేయాలి? అందుకే అట్లా వున్నామని సమాధానం చెప్పాయిట ఆ పూలు. అప్పుడు తాటిచెట్లు వాటిని బుజ్జగించి, ఆ సంక్రాంతిలక్ష్మి భూదేవి. ఎప్పుడూ నిండుచూలాలే. కాబట్టి, మీరు ఆమె నడుమును చుట్టలేరు అని ఓదార్చాయిట!!
ఇంతటి సౌభాగ్యవతి, అష్టలక్ష్మీ అయిన ఆ భూదేవి, సంక్రాంతిలక్ష్మి రూపంలో ధగ,ధగా మెరిసిపోతూంటే, కన్నుకుట్టి, ఆమె సంపదను ఎవరైనా దోచుకువెళ్తారేమో అన్న అనుమానంతో కాబోలు, నల్లటి దుస్తులు ధరించి, ఆకుపచ్చని “విచ్చు” టోపీలను పెట్టుకొని, ఆజానుభావులను తలదన్నేటట్లుగా తాటిచెట్టంత ఎత్తున్న కాపలాదారులు ఆ పొలాల గట్లంబడి పహారాకాస్తున్నారు. మీ కర్ధమయేవుంటుంది. అవి తాటిచెట్లే మరి! అయినా, మన బుద్ధి సరైంది కాదుకాబట్టే, మనకు అన్నీ అనుమానాలే! తనే, తనలోని సంపదను మనందరికీ పంచిఇస్తుంటే, ఇంకా ఆమెను దోచుకునేవారెవరు?! ఆమే సంక్రాంతి లక్ష్మి. ఆమె శోభే సంక్రాంతి శోభ!
ఇంతకీ, “సంక్రాంతి” అంటే అర్ధం ఏమిటి? “సం+క్రాంతి”. “సం” అంటే మంచి, చక్కటి అని అర్ధం. “క్రాంతి” అంటే, “క్రమణము” అని అర్ధం. “క్రమణము” అంటే “అడుగిడుట లేదా నడుచుకొనుట” అని అర్ధం. కాబట్టి, సంక్రాంతి అంటే మంచి, చక్కటి జీవనపధంలో అడుగుపెట్టి, నడుచుకోవాలి అని అర్ధం. మరి మనందరి సంకల్పాలుకూడా అదే కావాలని కోరుకుంటూ, శెలవ్. స్వస్తి.

ఒక్కరోజుకి మీ (మా) “గుంటూరు” వెళ్ళి వచ్చినా మనుషుల్లో సంక్రాంతి శోభ తగ్గినా పుడమితల్లి ఒడిలో ఇంకా తగ్గలేదని శోభీయమానంగా రైల్లో చుట్టి సంక్రాంతి అంతా చూసి వచ్చారు.
సంక్రాంతి శుభాకాంక్షలు!
ఆర్యా, నమస్కారములు.
మన గుంటూరు పల్లెల శోభ దేశమంతటా వ్యాప్తి చెందాలనేదే నా అభిలాష. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ,
మీ స్నేహశీలి,
మాధవరావు.
వర్ణలలు చాలా బాగున్నాయి. హాపీ సంక్రాంతి.
శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
సంక్రాంతి శుభాకాంక్షలు
శ్రీ కుమార్ గారికి, నమస్కారములు.
మీకుకూడా మా అందరి తరుపున సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మిత్రులు మాధవరావుగారు,
నిజంగా సంక్రాంతిని చూపించారు.
శ్రీ శర్మగారికి, నమస్కారములు.
వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం. అన్నట్లు మీ “పెళ్ళిచూపులు” కధానిక చాలా బాగుంది. దానిపై కొందరి వ్యాఖ్యలు నాకు అర్ధం కాలేదు. మీరు వ్రాసిన దానిలో ఇతరులను బాధ పెట్టేది ఏదీ నాకు కనిపించలేదు. మరి వారి వ్యాఖ్యలకి అర్ధం ఏమిటో నాకు తెలియలేదు. అయినా వాటిని పట్టించుకోకుండా వుండటమే మేలు అని భావన.
మీ స్నేహశీలి,
మాధవరావు.
chala rojula taruvata nijamyna sankranti vachinattu undi….me vyasamu bagundi….
శ్రీ కిరణ్ గారికి, నమస్కారములు.
మీకు ఈ సంక్రాంతి శోభ వ్యాసం నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వున్నది. రాబోయే రోజుల్లో వ్యవసాయం రైతులకు లాభసాటిగా వుంటూ, దేశమంతటా సంక్రాంతి శోభ మరింత శోభాయమయంగా వుండాలని అందరం ఆశిద్దాము.
మీ స్నేహశీలి,
మాధవరావు.
sankranti gurinchi chala baga chepparu…nijamyna sankranti ante yemito me vyasam dwara telusukovachu