“ రాధామధవ్ గద్యకవితలు ”

“ నా మొదటి ప్రేమపత్రం ”

నేను (నేనూ) ప్రేమించాను (మనుషులుకాక మరెవరు ప్రేమిస్తారు చెప్పండి)
మొట్టమొదటిసారిగా ప్రేమించాను (రెండవసారి, మూడవసారీ ప్రేమించంటం వుంటాయా చెప్పండి)
ప్రేమలేఖ రాయాలనుకున్నా (అదేదో బ్రహ్మ సృష్టికార్యం చేసినట్లూ)
ప్రేమలేఖ రాయటం మొదలెట్టాను (ఇదేమన్నా వాల్మీకి రామాయణం మొదలుపెట్టటంలాంటిదా)
ప్రియా, నేను (నేనూ) నిన్ను ప్రేమిస్తున్నాను (భూమిలో విత్తనం నాటుకుంది)
నా ప్రేమ నిజమైందే (నిజమేనేమో అన్నట్లుగా మొలక బయటకు వచ్చింది)
నీపై నా ప్రేమ దినదినాభివృద్ధి చెందుతున్నది (మొలక మారాకువేసింది)
నా ప్రేమను నువ్వు గుర్తించావా ప్రియా (మొగ్గ తొడిగింది)
నీపై నా ప్రేమ నిండైనది ప్రియా (పువ్వు విరిసింది)
నా మనసంతా నీపై ప్రేమనే ప్రియా (పువ్వు పరిమళించింది)
నీపై నా ప్రేమను చెప్పాలనుకున్నాను ప్రియా (పరిమళాలు వెదజల్లాయి ప్రేయసివైపుకు)
నీపై నా ప్రేమ వికసిత పద్మంలాంటిది ప్రియా (సూర్యుని కాంతితో పద్మాలు వికసించినట్లు)
కలువలరాణీ, నా ప్రేమలేఖను నీకిద్దామనుకున్నాను (కలువల రాణి చంద్రకాంతికే విచ్చుకుంటుంది)
సాయింత్రపు చల్లనివేళలో, చల్లని పిల్లగాలులు వీస్తున్నప్పుడు
నా ప్రేమలేఖను నీకందిస్తాను
సిగ్గుతో కందిన నీ ముఖారవిందాన్ని చూస్తాను ప్రియా
సూర్యాస్తమయింది
పద్మం ముకుళించింది
ముకుళించిన పద్మపత్రాలలో
చిక్కుకుంది నా మొదటి ప్రేమపత్రం !!!

Published in: on సెప్టెంబర్ 2, 2014 at 12:15 ఉద.09  వ్యాఖ్యానించండి  

The URI to TrackBack this entry is: https://madhavaraopabbaraju.wordpress.com/2014/09/02/%e0%b0%b0%e0%b0%be%e0%b0%a7%e0%b0%be%e0%b0%ae%e0%b0%a7%e0%b0%b5%e0%b1%8d-%e0%b0%97%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

వ్యాఖ్యానించండి