“ మనుషులు చేసిన దేవుళ్ళు ”
దేవతలను సృజించి, రచించి, సృష్టించినారీమానవులు
నామకరణములు చేసి, సహస్రనామాంకితులను చేసినారు
రూపములను రచించి, కొందరికి నామములను దిద్ది గోవిందుడన్నారు
నాలుగుముఖములనుబెట్టి, బ్రహ్మయనియు;
మూడు కన్నులుబెట్టి ముక్కంటనియన్నారు
శంఖ,చక్ర,శూల,గదాధరులనుజేసి,
కిరీటములనుబెట్టి, పీతాంబరులనుజేసి
తాము సృష్టించిన దేవుళ్ళకే పూజలుజేసి, భజనలుజేసి, మురిపాలుజేసి
తాము మురిసారు, తమను తామే మరిచారీమానవులు;
పాతాళమునందు, కొండగుహలయందు,
కొండశిఖరాగ్రములయందు, నీటియందు, నేలయందు
అచటనిచటయను భేదములేక గుళ్ళు,గోపురములనుగట్టి
అన్నిటా దేవుడున్నాడన్న చందమున
మట్టితో, కట్టెతో, కఠినశిలలతో దేవీదేవతామూర్తులను నిలబెట్టి
తమ చాతుర్యమును చాటుకున్నారీమానవులు;
తాము సృజించిన దేవతామూర్తులకు మహత్తుపెరగాలని
మత్స్యకూర్మాది యంత్రములను స్థాపించి, తంత్రములనుజేసి,
మంత్రములను మంత్రముగ్ధములుగా పఠించి,
సాములజేత ప్రత్యేక పూజలుజేయించి
తమతమ కోరికలను తీర్చమని,
తీర్చలేని కోరికలనుసైతం తీర్చమని
అడుగడుగు దండాలుబెట్టి, హారతులిచ్చి,
తలనీలాలే నీలమళులుగా సమర్పించి,
కోరిందిస్తే కానుకలిస్తామని ఊరించారీమానవులు, కానీ,
మరిచారు అవి మనుషులుజేసిన బొమ్మలనీ,
మరిచారు తాము దేవుడుజేసిన బొమ్మలమనీ;
సోది చెప్పించుకున్నారు; తాళపత్రగ్రంధములను శోధించమన్నారు
చేతిగీతలు చదివించుకున్నారు, జాతకములు వ్రాయించుకున్నారు
తమ నుదిటి గీతల జాతకములు అనుకూలముగా మారతాయేమోనని
తాయత్తులు కట్టించుకున్నారు మహత్తులతో తమ విపత్తులు
నిష్పత్తులేలేకుండా దూదిపింజలై పోవాలనీ,
జీవితాన హరివిల్లులే విరియాలనీ కోరుకున్నారీమానవులు;
ఊరూరూ, దేశదేశాలూపట్టి తిరిగారు
కనిపించని సుఖాలకై, శాంతిసౌఖ్యాలకై,
అలసి, సొలసిపోయారీమానవులు
ఆనందాన్ని అందుకోలేక;
వేదములను మరిచారు, ఉపనిషత్తులను మరిచారు,
వాటిని భోదించే గురువులను మరిచారీమానవులు
ఆత్మారాముడు ఎక్కడోలేడనీ,
తమ అంతరంగమునందే వున్నాడనీ,
గుప్పెడంత హృదయాంతరంగమునందు
ఆనందస్వరూపుడై వున్నాడనీ
తామే దైవస్వరూపములనీ భోదించే
తత్త్వవిదానందుల తత్త్వసారమును త్రాగండీ జనులారా
తరించండీ ఓ జనులారా.